ఖేల్ ఖతం

5 Apr, 2015 03:30 IST|Sakshi
పోలీస్ కాల్పుల్లో మృతిచెందిన ముష్కరులు అస్లాం అయూబ్, జాకీర్ బాదల్
  • సూర్యాపేట కాల్పుల దుండగులు హతం
  • నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ఎన్‌కౌంటర్
  •  యూపీకి చెందిన అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా గుర్తింపు
  •  ప్రాణాలకు తెగించి మరీ కాల్చి మట్టుపెట్టిన పోలీసులు
  •  ఎదురుకాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందిన కానిస్టేబుల్ నాగరాజు
  •  తీవ్రంగా గాయపడ్డ ఆత్మకూరు(ఎం) ఎస్‌ఐ సిద్ధయ్య.. పరిస్థితి విషమం
  •  రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి గాయాలు.. కామినేనిలో చికిత్స
  •  సినీఫక్కీలో ఘటన, రెండున్నర గంటల చేజింగ్ తర్వాత ముష్కరులు హతం
  •  ముందు రెండుసార్లు ఎదురుపడ్డా ఆయుధాలు లేక చేతులెత్తేసిన పోలీసులు
  •  నలుగురు కానిస్టేబుళ్ల ధైర్యసాహసాలతో జానకీపురంలో ముగిసిన వేట
  •  సిమి’ ఉగ్రవాదులంటున్న పోలీస్ వర్గాలు.. ఇంకా గుర్తించలేదన్న డీజీపీ
  •  
     సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆపరేషన్ ‘సూర్యాపేట’ ముగిసింది. రెండు రోజులుగా సాగిన ‘ఖేల్’ ఖతమైంది. నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డ దుండగులు హతమయ్యారు. జిల్లాలోని మోత్కూరు మండలం జానకీపురం గ్రామ శివారులో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ముష్కరులను పోలీసులు మట్టుబెట్టారు. వీరిని స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌గా గుర్తించారు. అలాగే సూర్యాపేట ఘటనలో ఎత్తుకెళ్లిన కార్బైన్ కూడా లభించడంతో బస్టాండ్‌లో కాల్పులు జరిపింది వీరేనని కూడా నిర్ధారణ అయింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ కానిస్టేబుల్ చనిపోయారు. ఆత్మకూర్(ఎం) పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నాగరాజు(28) ముష్కరుల బుల్లెట్లకు బలయ్యారు. ఆత్మకూర్(ఎం) స్టేషన్ ఎస్‌ఐ సిద్ధయ్య, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి కూడా గాయపడ్డారు. సిద్ధయ్య శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేస్తున్నారు. కాగా, సిద్ధయ్య భార్య ధరణి నిండుచూలాలు. భర్తను చూడటానికి వెళ్లగానే పురిటినొప్పులు రావడంతో ఆమెను కూడా శనివారం రాత్రి కామినేనిలోనే చేర్చారు. కాసేపటికి ఆమెకు బాబు పుట్టాడు. ఆద్యంతం సినీఫక్కీలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముష్కరులు హతమైనా కానిస్టేబుల్ చనిపోవడం, ఎస్‌ఐ ప్రాణాపాయ స్థితిలో ఉండటం విషాదం.


     ఉదయం అర్వపల్లి నుంచి మొదలు...


     బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిపి పరారవడం, వారికోసం పోలీస్ యంత్రాంగమంతా తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టడం తెలిసిందే. విస్తృతంగా తనిఖీలు జరుపుతుండడంతో దుండగులు నల్లగొండ జిల్లా దాటి వెళ్లలేకపోయారు. ఈ రెండు రోజులు ఎక్కడ తలదాచుకున్నారో తెలియకపోయినా శనివారం ఉదయం అకస్మాత్తుగా బయటకువచ్చారు. సూర్యాపేటకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్వపల్లి దర్గా ప్రాంతంలో కనిపించారు. ఉదయం 6 గంటలప్పుడు అర్వపల్లిలోని ముదిరాజ్ కాలనీ మీదుగా సీతారాంపురంవైపు నడుచుకుంటూ వెళ్లారు. తమ వద్ద ఉన్న కార్బైన్‌ను దుప్పటిలో, నాటు తుపాకీని కవరులో పెట్టుకుని వెళుతున్న వీరిని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో తుంగతుర్తి సీఐ గంగారాం ఓ ప్రైవేటు వాహనంలో గాలింపు చే పట్టారు. సీతారాంపురం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో దుండగులున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే సీఐ గంగారాం వారిపైకి కాల్పులు జరిపారు. ఆరు రౌండ్ల కాల్పుల అనంతరం ఆయన తుపాకీ పేలలేదు. దాంతో దుండగులు ఎదురుకాల్పులకు దిగారు. ఇతర సిబ్బంది వద్ద ఆయుధాలు లేకపోవడంతో పోలీసులు సీతారాంపురంవైపు వెళ్లిపోయారు. దుండగులు కాలువ నుంచి బయటపడి మళ్లీ అర్వపల్లికి వచ్చారు. బస్టాండ్ సమీపంలో లింగయ్య అనే వ్యక్తిని ఆపి అతని బజాజ్ డిస్కవరీ బైక్ లాక్కుని తిరుమలగిరివైపు వెళ్లారు. నాగారం క్రాస్‌రోడ్డు వరకు ప్రయాణించి ఫణిగిరి స్టేజీ నుంచి ఈటూరు మీదుగా అనంతారం రోడ్డుపైకి చేరుకున్నారు.

    అక్కడ రోడ్డు పక్కన ఓ దుకాణంలో పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికి ఉదయం 7:30 అయింది. అప్పటికే సమాచారం అందుకున్న  మోత్కూరు ఎస్‌ఐ పులిందర్‌భట్ సిబ్బందితో అనంతారం మీదుగా వెళ్తూ, పెట్రోల్ పోయించుకుంటున్న దుండగులను గుర్తించారు. అప్పటికే వారిని దాటిపోవడంతో పోలీసులు వాహనాన్ని ఆపి కిందకు దిగారు. తమవద్ద ఆయుధాలు లేకపోవడంతో కర్రలు, రాళ్లు పట్టుకుని గట్టిగా అరుస్తూ, గ్రామస్తులను ఇళ్లలోకి వెళ్లాలంటూ హెచ్చరించారు. అది చూసిన దుండగులు తమ ఆయుధాన్ని బయటకు తీసి భుజానికి తగిలించుకున్నారు. దాన్ని పోలీసులకు  చూపుతూ మోత్కూరువైపు బైక్‌పై వెళ్లారు. మోత్కూరు పీఎస్‌కు చెందిన అనిల్, రమేశ్ ధైర్యంగా మరో వాహనంపై వారిని వెంబడించారు. ఆయుధాల్లేకపోయినా వారిని అనుసరించారు. అనంతారం నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని చిర్రగూడూరు వరకు వెళ్లి దుండగులు కుడివైపుమళ్లారు. పోలీసులు గ్రామస్తులను పోగుచేసుకుని వారిని వెంబడించారు. మార్గంలో వాగు రావడం, ఇసుకలో బైక్ కదలకపోవడంతో దుండగులు దాన్ని వదిలి వాగులో దాక్కున్నారు. ఇద్దరు పోలీసులతో పాటు యువకులు రావడంతో వారిపై కాల్పులు జరిపారు. దాంతో అంతా చెట్ల చాటున దాక్కున్నారు. యువకులు తెచ్చిన ఓ వాహనంపై ముష్కరులిద్దరూ జానకీపురం రోడ్డెక్కారు.
     
     ఇక్కడే డెత్‌స్పాట్...
     
     జానకీపురం వైపునకు బైక్‌పై వెళుతున్న దుండగులు ఎదురుగా ఎడ్లబండి రావడంతో ఆగిపోయారు. ఆ బండి వెనుకనే ఆత్మకూరు(ఎం) ఎస్‌ఐ సిద్ధయ్య తన సిబ్బందితో కలిసి మరో వాహనంలో వస్తున్నారు. దగ్గరకు వచ్చేంతవరకు ఒకరినొకరు గుర్తించలేదు. అకస్మాత్తుగా పోలీసులు కనిపించడంతో దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. డ్రైవర్ సీటులో ఉన్న కానిస్టేబుల్ నాగరాజు నుదిటిలోకి బుల్లెట్ దిగడంతో అక్కడికక్కడే చనిపోయారు.
     
     ముందు సీటులో ఉన్న ఎస్‌ఐ సిద్ధయ్యకు పొట్ట, మెదడు భాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వాహనం వద్దకొచ్చిన దుండగులు.. ఆయుధాలిస్తే వదిలేస్తామని హిందీలో చెప్పారు. వెనుక సీట్లో ఉన్న కానిస్టేబుల్ మధు ఆయుధాలిస్తున్నాం ఉండమని చెబుతూనే ఒక్కసారిగా తనవైపున్న డోర్‌తో ఇద్దరినీ గట్టిగా గుద్దాడు. వారు పక్కనున్న చెట్లలో పడిపోవడంతో ఒక్క ఉదుటున వారిపైకి దూకాడు. వారితో పెనుగులాడుతున్న సమయానికే పోలీసులు కేకలు వేశారు. వారి వాహనానికి 5 మీటర్ల దూరంలో రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి దిగి కాల్పులు ప్రారంభించారు. దుండగులు ఆయనను కూడా టార్గెట్ చేశారు. ఒక బుల్లెట్ ఆయన లాఠీని రాసుకుంటూ వెళ్లిపోయింది. మరో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు... సీఐ గన్‌మన్ జానకిరాం కార్బన్‌ను తీసుకుని దుండగులపై కాల్పులు జరిపాడు. ఎక్కడా వారికి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా సమయస్ఫూర్తితో కాల్పులు జరపడంతో ఇద్దరూ అక్కడే చనిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మోత్కూరు కానిస్టేబుళ్లు అనిల్, రమేశ్.. దుండగులను వెంబడించడం, గతంలో గ్రేహౌండ్స్‌లో పనిచేసిన ధైర్యాన్ని మధు ప్రదర్శించడం, వెంకటేశ్వర్లు సమయస్ఫూర్తితో తుపాకీ ఎక్కుపెట్టడంతో ఉదయం 8 గంటలకు పోలీసుల వేట ముగిసింది. తమవారిని పొట్టనబెట్టుకున్న దుండగులను పోలీసులు కసితీరా కాల్చిచంపారు. దుండగుల శరీరం నిండా బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం... నాగరాజు మృతదేహాన్ని, సిద్ధయ్యను ఆస్పత్రికి తరలించారు.
     
     
     ఆయుధాలు లేకుండా ఆపరేషన్!
     ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. సాయుధులైన దుండగులను ఎదుర్కొనే ప్రణాళిక సరిగ్గా లేకపోవడంతో మరో పోలీసు ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది. తుంగతుర్తి సీఐకి దుండగులు తారసపడిన సమయంలోనే ఇతర పోలీసుల దగ్గర ఆయుధాలున్నా, కనీసం సీఐ గన్‌మెన్ అందుబాటులో ఉన్నా ఎస్సారెస్పీ కాల్వలోనే దుండగులు హతమయ్యేవారు. అనంతారంలో మోత్కూరు పోలీసుల వద్ద ఆయుధాలు లేకే దుండగులు బతికిపోయారు. సూర్యాపేట ఘటన సమయంలో కూడా అనుమానితులను విచారించే సమయంలో పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఇలా ఆయుధాలు లేకుండా ఆపరేషన్‌లో పాల్గొనడం పట్ల పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
     
     ఘటనాస్థలికి డీజీపీ
     ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన దుండగుల మృతదేహాలను పరిశీలించారు. ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఆధారాలను సేకరించింది. కాగా, దుండగులను ఇంకా గుర్తించలేదని డీజీపీ చెప్పారు. పాత నేరస్తుల ఫొటోల ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మృతదేహాల వద్ద ఆయుధాలతో పాటు బస్సు టికెట్లు మాత్రమే లభించాయన్నారు. ఇతర ఆధారాలేవీ లభ్యం కాకపోవడంతో వెంటనే గుర్తించలేకపోయామన్నారు. దీనిపై ఆదివారం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.
     
     ప్రాణాలకు తెగించి..


     భయమనేదే తెలియదన్నట్టు పేట్రేగిపోయిన ఇద్దరు దుండగులను హతమార్చడానికి పోలీసులు ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. గ్రేహౌండ్స్‌లో పనిచేసిన కానిస్టేబుల్ మధు చూపించిన ధైర్యసాహసాలు పోలీసు శాఖ పరువు నిలబెట్టాయనే చెప్పాలి. అతనే ఆ సాహసం చేయకుంటే మళ్లీ దుండగులకు ఆయుధాలు అప్పగించడమో, అంతా చనిపోవడమో జరిగేది. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తుపాకీని పేల్చడంలో 2 సెకన్లు ఆలస్యమైనా దుండగులు ఇంకో రౌండ్ కాల్పులు జరిపేవారని, అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదని పోలీసులు చెబుతున్నారు.
     
     పోలీసులే టార్గెట్!


     రోడ్లపై కాలినడకన, వాహనంపై సంచరించిన దుండగులు తమ చేతిలో ఆయుధాలున్నా సామాన్య ప్రజలను మాత్రం ఏమీ చేయలేదు. కేవలం పోలీసులు ఎదురుపడ్డప్పుడు మాత్రం ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరు కిరాయి హంతకులా లేక ఉగ్రవాదులా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఉగ్రవాదులైతే ఇలా బైక్‌ల మీద తిరుగుతూ హల్‌చల్ చేయరనే చర్చ కూడా జరుగుతోంది. కానీ, పోలీసులు మాత్రం ఈ దుండగులకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయని అంటున్నారు. వీరు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా జైలు నుంచి తప్పించుకున్న ఏడుగురి ముఠాలోని సభ్యులని చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు