భయం.. భయంగానే..

8 May, 2020 01:21 IST|Sakshi
గురువారం సిద్ధిపేటలో రిఫ్రిజిరేటర్‌ను రిక్షాలో తీసుకెళ్తున్న దృశ్యం

గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో కార్యకలాపాలు ప్రారంభం

మెల్లగా తెరుచుకుంటున్న దుకాణాలు

మున్సిపాలిటీల్లో సరి, బేసి పద్ధతిలో

ప్రధాన రోడ్లలో పకడ్బందీగా అమలు

గల్లీల్లో ఇష్టారాజ్యంగా దుకాణాల నిర్వహణ.. అక్కడక్కడా భౌతిక దూరం హుష్‌కాకి

సందడి తగ్గిన మద్యం దుకాణాలు

గత మూడు రోజులుగా రాష్ట్రంలో పెరిగిన జన సమ్మర్ధం

ఇంకా ప్రారంభం కాని రవాణా సదుపాయాలు.. రొటేషన్‌ పద్ధతిలో ప్రభుత్వ కార్యాలయాలకు సిబ్బంది

ఊపందుకుంటున్న రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఆంక్షలు కొన్ని తొలగిపోయాయి. మళ్లీ యథావిధిగా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. రోడ్లపైకి వచ్చే ప్రజల సంఖ్య కూడా గత రెండు రోజుల్లో పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు కొంత ఊరట కలిగించింది కానీ.. కరోనా భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఈనెల 29 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని రాష్ట్రం ప్రకటించడంతో అప్పటివరకు జాగ్రత్తలు కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఇప్పటికీ మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటిస్తూనే ఉన్నారు. భయం భయంగానే బయటకు వెళ్లి వస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు కారణంగా ఏదో జరిగిపోతుందనే ఆందోళన లేకున్నా అక్కడక్కడా ప్రజలు భౌతికదూరాన్ని విస్మరిస్తుండటమే ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తెరుచుకున్న మద్యం దుకాణాలు, భారీగా రద్దీ ఉండే మాంసం దుకాణాలు, ఆటోలు, బ్యాంకులు తదితర ప్రదేశాల్లో ఈ భౌతిక దూరం కన్పించట్లేదు. అయితే మెజారిటీ ప్రజలు మాత్రం కరోనా భయంతో నిబంధనల స్ఫూర్తి కొనసాగిస్తున్నారు.

మున్సిపాలిటీల్లో సరి, బేసి
రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో ఉన్న పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలు బాగానే అమలవుతున్నాయి. ముఖ్యంగా దుకాణాలు సరి, బేసి పద్ధతిలో తెరుస్తున్నారు. పురపాలిక అధికారులు  మర్చంట్‌ అసోసియేషన్లు, భవన నిర్మాణ కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలు వివరిస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న ప్రధాన రహదారులు, వీధుల్లో సరి, బేసి సంఖ్యలో షాపులు తెరుస్తున్నా... గల్లీల్లో ఉన్న దుకాణాల్లో ఎలాంటి నిబంధనలు అమలు కావట్లేదు. సమయం పాటించకుండా ఇష్టారాజ్యంగా అన్ని దుకాణాలను తెరుస్తున్నారని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతోంది. చాలా చోట్ల దుకాణాల వద్ద భౌతిక దూరం కూడా పాటించట్లేదు. ఈ రెండు రోజుల్లో జరిగిన మంచి పరిణామం ఏంటంటే.. భౌతిక దూరం పాటించని వారు, మాస్కులు ధరించకుండా బయటకు వస్తున్న వారు, బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మివేసే వారికి భారీగా జరిమానాలు విధించాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వస్తుండటం గమనార్హం. చదవండి: తెలంగాణలో కొత్త రూట్లో ప్రజా రవాణా!


ప్రభుత్వ కార్యాలయాలు పునఃప్రారంభం
గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో 45 రోజుల తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలు ఎప్పటి నుంచో పనిలో ఉన్నా మిగిలిన కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పనిచేస్తుండటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా నెమ్మదిగా ఊపందుకుంటోంది. ఆర్టీఏ కార్యాలయాల్లో పెద్దగా రద్దీ కనిపించకపోయినా పరిమిత సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. రవాణా శాఖ కూడా ఆన్‌లైన్‌ స్లాట్లు తగ్గించడంతో పెద్దగా రావట్లేదు. మిగిలిన కార్యాలయాలకు ఉద్యోగులు కొన్ని చోట్ల రొటేషన్‌ పద్ధతిలో వస్తుండగా, మరికొన్ని చోట్ల దాదాపు అందరూ వస్తున్నారు. అయితే, ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం భౌతికదూరం కచ్చితంగా అమలు చేస్తుండటం గమనార్హం. గ్రీన్‌ జోన్‌లో కొంత రవాణా సౌకర్యం మెరుగుపడినా, ఆరెంజ్‌ జోన్‌ జిల్లాల్లో ఆటోలు, క్యాబ్‌లు ఇంకా పూర్తిస్థాయిలో రోడ్డెక్కకపోవడంతో ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తప్పట్లేదు. బుధవారం మీటర్ల కొద్దీ బారులతో కళకళలాడిన మద్యం దుకాణాల వద్ద గురువారం సందడి తగ్గింది. తొలిరోజు ఎగబడిన స్థాయిలో మద్యం కోసం ప్రజలు ఆరాటపడలేదు. ఈ దుకాణాల వద్ద కూడా కొన్ని చోట్ల భౌతిక దూరం అమలు కావట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మద్యానికి అనుబంధంగా అమ్మకాలు జరిగే మాంసం, సోడాలు, వాటర్‌ బాటిళ్లు అమ్మే దుకాణాలు, బజ్జీ, బోండాల బండ్లు తమ కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించాయి.

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇది
గ్రీన్‌ జోన్‌లో ఉన్న ఉన్న యాదాద్రి భువనగిరి, వరంగల్‌ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి జిల్లాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీధుల్లో జనసంచారం పెరిగింది. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను చాలా వరకు ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువ మంది మాస్క్‌లు ధరించి బయటకు వస్తూ భౌతిక దూరం పాటిస్తున్నారు. కానీ కొందరు మాత్రం దుర్వినియోగం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్, ఆర్టీఏ కార్యాలయాలు తెరుచుకున్నాయి. వ్యాపార సముదాయాలు సరి, బేసి సంఖ్యలో తెరుస్తున్నారు. ఆటోలు, క్యాబ్‌లు నడుస్తున్నాయి. మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఆటోలు, బ్యాంకులు, మద్యం, మటన్, చికెన్, రేషన్‌దుకాణాల వద్ద కొన్ని చోట్ల భౌతికదూరం పాటించట్లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం భౌతిక దూరం పాటిస్తున్నారు. పోలీసులు పికెటింగ్‌లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించి హోం క్వారంటైన్‌ చేస్తున్నారు.

సిద్దిపేటలో దుస్తుల దుకాణంలో దుమ్ము దులుపుతున్న నిర్వాహకులు 
ఆరెంజ్‌ జోన్‌ జిల్లాల్లో..
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు సండలించడంతో కొద్ది మంది రోడ్లపైకి వచ్చారు. నిత్యావసర వస్తువులు, భవన నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉండే షాపులు కూడా తెరిచారు. గతంలో కూలీ పనులు లేక ఇంటికే పరిమితమైన మేస్త్రీలు, సిమెంట్‌ పనిచేసే వారు పనులకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలు, రైతులు వారి వారి పనులకు వెళ్తున్నారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో షాపుల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించగా.. సిద్దిపేటలో మాత్రం కొన్ని షాపుల వద్ద ప్రజలు ఇష్టారాజ్యంగా గుంపులు గుంపులుగా వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అయితే, ప్రజల్లో కరోనా అంటే భయం మాత్రం పోలేదు.

మాస్కులు పెట్టుకోవడంతో పాటు శానిటైజర్లు వెంట తీసుకెళ్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత రోడ్లు నిర్మానుష్యమవుతున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే సడలింపులతో ప్రజలు భౌతిక దూరం పాటించడంలో అలసత్వం వహిస్తున్నారు. సరిహద్దు జిల్లాల నుంచి రాకపోకలు బంద్‌ అయినా.. సడలింపులతో ప్రమాదం పొంచి ఉందని జనాలు భయపడుతున్నారు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో కూడా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. గతంలో ఉదయం 9 గంటల వరకు మాత్రమే దుకాణాలు ఉండగా, ఇప్పుడు సాయంత్రం వరకు తెరిచే అవకాశం ఉండటంతో నెమ్మదిగానే రోడ్ల మీదకు వెళ్తున్నారు. ఈ జిల్లాలో కూడా అక్కడక్కడా భౌతిక దూరం పాటించట్లేదు. మిగిలిన జిల్లాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 

అప్రమత్తత తొలుగుతోందా..?
రాష్ట్రంలో గత రెండు రోజులుగా పరిస్థితిని గమనిస్తే కరోనా పట్ల అప్రమత్తత క్రమంగా తగ్గుతుందనే అనుమానం కలుగుతోంది. ప్రభుత్వం నిబంధనలు సడలించింది ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకేనని, కరోనా భయం తొలగిపోయినందుకు కాదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వైద్య, సామాజిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మద్యం షాపులు, మాంసం దుకాణాలు, నిత్యావసరాల దుకాణాలు, ఆటోలు, బ్యాంకుల్లో భౌతికదూరం మర్చిపోకూడదని చెబుతున్నారు. లాక్‌డౌన్‌ కఠినంగా అమల్లో ఉన్న సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం అయినందున ఆంక్షలు వాటంతట అవే అమలయ్యాయని, ఇప్పుడు క్రమంగా ప్రజలు రోడ్ల మీదకు వస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తోంది. ఏం కాదులే అనే నిర్లక్ష్యం మంచిది కాదని, లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో ఎత్తివేసి సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు గత నెలలో ఉన్నట్లే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదమే.. ఏమాత్రం అలసత్వం వహించినా ఇన్ని రోజుల కష్టం వృథా అయినట్టే. తస్మాత్‌ జాగ్రత్త.

మాస్క్‌ తప్పనిసరి చేయాలి
‘లాక్‌డౌన్‌ సడలింపుతో రోజు వారీ ఖర్చులకు ఇబ్బందులు తప్పనున్నాయి. లాక్‌డౌన్‌ మొదట్లో చూపిన స్ఫూర్తితో భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం జీవితంలో భాగం చేసుకోవాలి. అధికారులు సైతం మాస్క్‌ ధరించని వారికి, బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మి వేసే వారికి భారీ జరిమానాలు విధించాలి. ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి. - బొడ్డుపల్లి ఉపేంద్ర, వ్యాపారి మహబూబాబాద్‌

మెల్లమెల్లగా మానేస్తున్నారు
గ్రీన్‌ జోన్‌లో ఉన్న యాదాద్రి భువనగిరిలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు ఎత్తేయడంతో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కూడా లేదన్న కారణంతో నిబంధనలను ప్రజలు పట్టించుకోవడం మానేస్తున్నారు. మద్యం, మాంసం, నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించట్లేదు.’
-పూసలోజు కృష్ణాచారి, యాదాద్రి భువనగిరి

మరిన్ని వార్తలు