నేటి నుంచి భట్టి యాత్ర

28 Apr, 2019 01:31 IST|Sakshi

ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సీఎల్పీ నేత పర్యటన

కేసీఆర్, కేటీఆర్‌ల క్విడ్‌ప్రోకో చర్యలను ఎండగట్టేందుకే: భట్టి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ‘ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర’ చేపడుతున్నారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర మే 2 వరకు పార్టీ ఫిరాయించిన ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొనసాగుతుందని ఆయన కార్యాలయ వర్గాలు శనివారం తెలిపాయి. ఆదివారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం 11 గంటలకు అక్కడ ఏర్పాటు చేసే నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో భట్టి పాల్గొంటారు.ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం నుంచి యాత్రను ప్రారంభిస్తారు.

ఆదివారం అశ్వాపురం, మణుగూరుల్లో యాత్ర జరగనుంది. 29న ఉదయం పినపాక పరిధిలోని ఏడూళ్ల బయ్యారం, కరకగూడెం, లక్ష్మీపురం మీదుగా సాయంత్రం ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి చేరుకొని అక్కడ సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి ఇల్లెందులోనే బస చేసి ఆ తర్వాత వరుసగా ఇల్లెందుతోపాటు కొత్తగూడెం, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో 2వ తేదీ వరకు యాత్ర నిర్వహించనున్నారు. మిగిలిన జిల్లాలకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలోనే విడుదల చేయనున్నారు. తన యాత్రలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలతో భట్టి సమావేశం కానున్నారు. ఆయా మండలాల పరిధిలోని ముఖ్య కార్యకర్తలతో భేటీ కానున్నారు. పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే ప్రయత్నం చేయనున్నారు.

నిరంకుశ విధానాలపై గళం విప్పేందుకే..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపై ప్రతిపక్ష నేతగా గళం విప్పేందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి దాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ క్విడ్‌ ప్రోకో పద్ధతిలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు యాత్ర చేపట్టినట్లు శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన యాత్రకు ప్రజాస్వామికవాదులు మద్దతివ్వాలని ఆయన కోరారు.

>
మరిన్ని వార్తలు