ఏం ‘సెట్టో’!

13 Sep, 2014 01:35 IST|Sakshi
ఏం ‘సెట్టో’!

- రెండోవిడత ఇక కలే..
- నిరాశలో ఎంసెట్ అభ్యర్థులు
- అగమ్యగోచరంగా 3వేల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్
- కళాశాలల మార్పిడికి అవకాశం ఇవ్వాలని విన్నపం
 శాతవాహన యూనివర్సిటీ : ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఎమరుపాటుగా వ్యవహరించిన విద్యార్థులకు సుప్రీంకోర్టు గట్టి షాకే ఇచ్చింది. ఇప్పటికే ఆలస్యమైనందున రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వలేమంటూ తీర్పునివ్వడంతో మొదటి కౌన్సెలింగ్‌కు వెళ్లని విద్యార్థుల పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుక చందంగా మారింది. ఇటు ఎంసెట్‌లో సీటు రాక, అటు డిగ్రీలో చేరే సమయం దాటిపోయి అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఇక షరతులతో కూడిన అనుమతి తెచ్చుకున్న కళాశాలలు రెండో విడతపైనే గంపడు ఆశలు పెంచుకోగా... సుప్రీం తీర్పు వాటికి అశనిపాతమే అయింది.
 
ఎంసెట్ ఎంట్రెన్స్ పూర్తయ్యాక రాష్ట్ర విభజన ప్రక్రియతో అడ్మిషన్లలో గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఆగస్టు 14 నుంచి 23 వరకు కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టింది. సీట్ల కేటాయింపు 31 వరకు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలలకు అనుమతి రాకపోగా... వాటిలో చేరాలనుకున్న విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ప్రతీసారి రెండుసార్లు కౌన్సెలింగ్ ఉంటుండడంతో ఈసారి కూడా అలాగే ఉంటుందనే భావనతో అప్పుడు మళ్లీ సీటు మార్చుకోవచ్చని కౌన్సెలింగ్‌లో ఉన్న కొన్ని కళాశాలలను ఆప్షన్‌గా ఎంచుకున్నారు. మరోదఫా కౌన్సెలింగ్‌కు అనుమతి నిరాకరించడంతో ఇప్పు డు ఆ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. నచ్చని కళాశాలలో చదవలేక, నచ్చిన కళాశాలను ఎంచుకునే అవకాశం లేక కొట్టుమిట్టాడుతున్నారు.
 
సీటు వచ్చి కొందరు... కౌన్సెలింగ్‌కు వెళ్లక మరికొందరు.
జిల్లాలో సుమారు 3 వేల మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలకొద్ది కళాశాలలకు అనుమతి రాకపోగా జిల్లాలోనూ ఏడు కళాశాలలకు అనుమతి రాలేదు. వీటిలో తమకు నచ్చిన కళాశాలలు కూడా ఉండడంతో కొందరు విద్యార్థులు రెండో దశ కౌన్సెలింగ్‌లో సీటు మార్పిడి చేసుకుందామనే ఉద్దేశంతో ఏదో కళాశాలను ఆప్షన్‌గా ఎంచుకున్నారు. విద్యార్థులు ఎంచుకున్న కళాశాలల్లో రిపోర్ట్ చేసేందుకు అధికారులు ఈ నెల 5 తుది గడువుగా సూచించారు. ఈలోపు రాష్ట్రవ్యాప్తంగా 174 కళాశాలలు హైకోర్టునాశ్రయించి షరతులతో కూడిన అనుమతి తెచ్చుకున్నాయి.

ఇందులో జిల్లాకు చెందిన ఏడు కళాశాలలు ఉన్నాయి. వెంటనే ఆయా కళాశాలలు తమ కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చంటూ... రెండో కౌన్సెలింగ్‌లో అవకాశం ఉంటుందంటూ జోరుగా ప్రచారం చేశాయి. దీంతో పలువురు విద్యార్థులు మొదటి కౌన్సెలింగ్‌లో ఎంచుకున్న కళాశాలల్లో రిపోర్ట్ చేయలేదు. వీరితోపాటు మరో 3 వేల మంది వరకు విద్యార్థులు రెండోదశ కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు. కానీ, వీరి ఆశలేవీ నెరవేరే అవకాశం లేకుండా పోయింది. కొందరు విద్యార్థులు ఫీజు కేటగిరీ ఎక్కువలో ఉన్న కళాశాలను ఎంపిక చేసుకుని, ఇప్పుడు మార్చుకునే అవకాశం లేక... అంత ఫీజు చెల్లించలేక తలలు పట్టుకుంటున్నారు.

నూతన ప్రవేశాలకు ఇవ్వకున్నా కనీసం కళాశాలల మార్పిడికైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో తమ కళాశాలలో చేరవచ్చంటూ విద్యార్థులను కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లనీయకుండా... కొన్ని కళాశాలలు ముందస్తుగానే సర్టిఫికెట్లు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు విద్యార్థులు స్పష్టత కోసం కౌన్సెలింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నా అక్కడ ఎలాంటి సమాచారం లేక నిరాశతో వెనుదిరుగుతున్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు