ఓట్లకు కోట్లు పంచుతున్నారు.. 

9 Apr, 2019 18:05 IST|Sakshi

దేశానికి మోదీ.. ఇందూరుకు అర్వింద్‌ రావాలి 

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ 

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ ప్రజల్లో ఉన్నారని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డబ్బుల టప్పీలు పెట్టుకుని ఓట్ల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారని బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. సోమవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ తరపున నగరంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బైక్‌ ర్యాలీ బోర్గాం(పి) నుంచి ప్రారంభమై పులాంగ్, దేవీ టాకిస్‌ చౌరస్తా, వీక్లీ మార్కెట్, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్‌ చౌరస్తా, జిల్లాపరిషత్‌ మీదుగా కంఠేశ్వర్‌ చౌరస్తాకు చేరుకుంది. రాజాసింగ్‌కు అడుగడుగునా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కంఠేశ్వర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌ షో రాజాసింగ్‌ మాట్లాడారు.

కేంద్రానికి మోదీ ఎలాగైతే అవసరమో.. అలాగే ఇందూరు పార్లమెంట్‌ స్థానానికి అర్వింద్‌ ధర్మపురి అవసరమన్నారు. అర్వింద్‌ ప్రజల వద్దకు వెళ్తూ ఓట్లడుగుతున్నారని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డబ్బులతో ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వ్యక్తి ముఖ్యమని ప్రజలు అర్థం చేసుకోవాలని, ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలని పేర్కొన్నారు. దేశానికి ఎలాంటి ప్రధాని కావాలో నిర్ణయించుకోవాలని, పాకిస్తాన్‌ వాళ్లు దేశంవైపు కన్నెత్తి చూస్తే కనుగుడ్లు పీకేసే ప్రధానమంత్రి మనకు ఉన్నారని తెలిపారు.

నేటితో ప్రచారం ముగియనున్నందున ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి బీజేపీకి అవకాశమివ్వాలని కోరాలని సూచించారు.  కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయని అడిగితే ఒక్క రూపాయి రాలేదని సీఎం కేసీఆర్‌ అబద్దాలు చెప్తున్నారని, రూ.1.30 లక్షల కోట్లు కేంద్రానివేనన్నారు. 24 గంటల విద్యుత్, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో కేంద్రం, రాష్ట్రం వాటా ఎంతుందో దమ్ముంటే సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఒక్కటే..  బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ 
ఒక వర్గానికి చెందిన ఓట్లు చీలిపోవద్దని పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఒక్కటే అయ్యాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ ఆరోపించారు. కవిత ఇంకా తండ్రి చాటు రాజకీయాలు చేస్తుందని, మతతత్వ రాజకీయాలకు తెర లేపుతుందన్నారు. ఓటమి భయంతో మండవ వెంకటేశ్వరరావును కూడా బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. దేశానికి టీఆర్‌ఎస్‌ అవసరమని కవిత చెప్తున్నారని, అది దేశానికి ప్రమాదకరమని విమర్శించారు.

రామమందిరంపై టీఆర్‌ఎస్‌ పాలసీ ఏంటో ఇంతవరకూ ప్రకటించడం లేదని, ఫెడరల్‌ ప్రంట్‌ అంటే ఏంటీ.. అందులో ఎవరు ఉన్నారని ప్రశ్నించారు.రామ మందిరం అక్కడే కడతాం.. మరోసారి మోదీ ప్రధాని అవుతారని స్పష్టంచేశారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ మనమందరం చౌకీదార్లమేనని, దేశ ప్రజలు చౌకిదార్లవైపు చూస్తున్నారని తెలిపారు ప్రతిఒక్కరూ కమలం గుర్తుకు ఓటేసి అర్వింద్‌ను భారీ మెజార్టీతో గెలిపించి మోదీకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నగర అధ్యక్షులు యెండల సుధాకర్, నాయకులు న్యాలం రాజు, గజం ఎల్లప్ప, స్వామి యాదవ్, శ్రీనివాస్‌ శర్మ, గీతారెడ్డి, కల్పనాఠాకూర్, బాల్‌రాజు, శ్రీనివాస్, బంటు రాము,  మోర్చాలు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


 

>
మరిన్ని వార్తలు