సీపీఎస్‌ రద్దుపై ఒకే మాట..ఒకే బాట

17 Sep, 2018 04:41 IST|Sakshi
సీపీఎస్‌ రద్దుపై వేదికపై నుంచి సంఘీభావం తెలుపుతున్న నేతలు

  తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని అన్ని పక్షాలు హామీ

  ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన ప్రతిపక్ష పార్టీలు

సాక్షి, హైదరాబాద్‌: తాము అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను (సీపీఎస్‌) రద్దు చేస్తామని వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు వెల్లడించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం సీపీఎస్‌పై ప్రతిపక్ష పార్టీలతో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌  సమావేశం నిర్వహించింది. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో నేతలు తమ వైఖరి వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరిస్తామని తమ పార్టీల మేనిఫెస్టోల్లో దీన్ని చేర్చుతామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1న, ఆ తరువాత నియమితులైన రాష్ట్ర ఉద్యోగ, టీచర్లకు సీపీఎస్‌ను వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టు 23న జారీ చేసిన జీవోను రద్దు చేస్తామని, ఎన్‌పీఎస్‌ ట్రస్టు, పీఎఫ్‌ఆర్‌డీఏకు సీపీఎస్‌ను రద్దు చేయాలని లేఖ రాస్తామని, వారికి పాత పెన్షన్‌ విధానంను (1980 రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌) వర్తింప చేస్తామని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, సీపీఎం పార్టీల తరపున లిఖితపూర్వక తీర్మానం చేసి, ఆయా పార్టీల నేతలు సంతకాలు చేశారు.

ఉద్యోగులకు తోడుగా...
సీపీఎస్‌ రద్దు విషయంలో పార్టీలన్నీ ఉద్యోగులకు బాసటగా నిలిచాయి. కాంగ్రెస్‌పార్టీ తప్పకుండా చర్యలు చేపడుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తన ప్రసంగంలో స్పష్టీకరించారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మన్‌ మాట్లాడుతూ ఉద్యోగులంతా తమ వెంట ఉండాలని, తాము ఉద్యోగుల వెంట ఉంటామన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చినా, అధికారంలో ఉన్న వారు దాన్ని రద్దు చేయాలన్నారు.

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగుల పెన్షన్‌ అనేది షేర్‌ మార్కెట్‌పై ఆధారపడకూడదన్నారు.సీపీఐ అధికార ప్రతినిధి పస్య పద్మ, సీపీఎం అధికారి ప్రతినిధి వేణుగోపాల్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనన్నారు. ఈ సమావేశంలో సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌ గౌడ్, ఉపాధ్యక్షుడు మ్యాన పవన్, కూరాకుల శ్రీనివాస్, రోషన్, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు