సునీల్‌ శర్మ టీఆర్‌ఎస్‌ ఏజెంట్‌

21 Nov, 2019 04:53 IST|Sakshi

ఆయనపై చర్యలు తీసుకోవాలి

ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకోండి

గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన విపక్షనేతలు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులను ప్రభావితం చేస్తున్నాయని సునీల్‌ శర్మ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విపక్ష పార్టీల నేతలు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాయి. గవర్నర్‌ను కలిసిన అనంతరం విపక్ష పార్టీల నేతలతో కలిసి టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం విలేకరులతో మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికులు ఎప్పుడొచ్చినా విధుల్లో చేర్చుకోవాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరేందుకు త్వరలో అఖిలపక్ష పార్టీల నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేపట్టబోమని గతంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా పేర్కొన్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ గుర్తు చేశారు. సునీల్‌ శర్మను ఆర్టీసీ ఎండీ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

సమ్మె విషయంలో సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గీతారెడ్డి మండిపడ్డారు. ప్రజాసమస్యలను చర్చించేందుకు గవర్నర్‌ తమకు సమయం ఇస్తున్నారు కానీ, సీఎం కేసీఆర్‌ ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై గవర్నర్‌కు ఉన్న శ్రద్ధ సీఎంకు లేదన్నారు. ఇప్పటివరకు 28 మంది కార్మికులు గుండెపోటుతో మృతి చెందినా కేసీఆర్‌కు కనికరం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా