ప్రభుత్వంపై పోరుకు విపక్షాలు సై

6 Jun, 2014 02:48 IST|Sakshi
ప్రభుత్వంపై పోరుకు విపక్షాలు సై
రుణ మాఫీ పరిమితులే తొలి అస్త్రం 
  బేషరతుగా మాఫీ చేయాల్సిందే: సీఎల్పీ
  ప్రభుత్వాన్ని నిలదీస్తాం: డీఎస్
  డ్వాక్రా రుణాల మాఫీ: డీకే అరుణ
  అన్ని రుణాలనూ మాఫీ చేయాలి: చింతల
  ఆంక్షలు విధిస్తే యుద్ధమే: ఆర్.కృష్ణయ్య
  హామీల ఉల్లంఘనే: నారాయణ
  కేసీఆర్... మాట నిలుపుకో: తమ్మినేని
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలి ప్రభుత్వం కొలువుదీరి కొద్ది రోజులైనా కాకముందే ప్రతిపక్షాలకు అప్పుడే చేతి నిండా పని మొదలైంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి దోహదపడ్డ రైతు రుణ మాఫీ అంశాన్నే తొలి అస్త్రంగా చేసుకుని ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ రంగంలోకి దిగాయి.
 
రైతులందరికీ రూ.లక్ష చొప్పున రుణాలను మాఫీ చేస్తానన్న ఎన్నికల హామీని టీఆర్‌ఎస్ తుంగలో తొక్కుతోందంటూ అవి తప్పుపడుతున్నాయి. గతేడాది తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు గురువారం విరుచుకుపడ్డాయి. ఇలా షరతులు విధించడం దారణమంటూ మండిపడ్డాయి. రైతులందరికీ బేషరతుగా రుణాలను మాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. లేదంటే ప్రజల పక్షాన పోరాటం తప్పదని హెచ్చరించాయి...
 
 10 రోజుల్లోనే బండారం బట్టబయలు
 అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే టీఆర్‌ఎస్ బండారం బయటపడింది. రైతులందరికీ రూ.లక్ష రుణాలను మాఫీ చేస్తామంటూ రైతులను నమ్మించి ఇప్పుడు ఏడాదికే పరిమితమనడం సరికాదు. దీనిపై రైతుల్లో ఆందోళన మొదలైంది. అధికారంలోకొస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని 2012 నుంచే టీడీపీ, టీఆర్‌ఎస్ ప్రజలను నమ్మించాయి. ఎవరూ బకాయిలు కట్టొద్దని చెప్పాయి. దాంతో చాలామంది రైతులు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు మళ్లీ రుణాలివ్వలేదు. కాబట్టి 2013-14లో రైతులకు బ్యాంకులిచ్చిన రుణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మాత్రమే మాఫీ చేస్తామనడం దారుణం. మూడు నాలుగేళ్లుగా పంటలు పండక, పండిన పంట అకాల వర్షాలతో నష్టపోయి రైతులు రుణాలు చెల్లించలేదు. కాబట్టి రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయాల్సిందే. ఇందుకోసం అందరినీ కూడగట్టి ఆందోళనకు దిగుతాం.
  - సీఎల్పీ నేత కె.జానారెడ్డి
 
 అన్ని రుణాలు మాఫీ చేయాల్సిందే
 ఫలానా ఏడాది తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. కాబట్టి రైతులందరికీ అన్ని రుణాలనూ మాఫీ చేయాల్సిందే. అధికారంలోకి వచ్చాక షరతులు విధించడం ప్రజలను మోసగించడమే. - శాసనమండలిలో విపక్ష నేత డి.శ్రీనివాస్
 
 ఆంక్షలంటే యుద్ధమే
 ఎన్నికల హామీ మేరకు ఎలాంటి షరతుల్లేకుండా రైతులందరికీ రుణాలను మాఫీ చేయాల్సిందే. లేకుంటే  ప్రభుత్వంపైప్రజా యుద్ధం తప్పదు. బంగారం తనిఖీ రుణాలు, గోదాముల్లో ధాన్యం, ష్యూరిటీ రుణాలను మినహాయించడం వాగ్దాన భంగమే. 2013-14 రుణాలనే మాఫీ చేస్తామంటే ఎన్నికల లబ్ధి కోసం మొక్కుబడి హామీ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. బేషరతుగా రుణాలను మాఫీ చేయకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతాం.
  - టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
 
 యూపీఏ మాదిరిగా మాఫీ చేయాల్సిందే
 యూపీఏ ప్రభుత్వం రైతులందరికీ బేషరతుగా రుణాలను మాఫీ చేసింది. సకాలంలో చెల్లించిన రైతులకూ ప్రోత్సాహకాలిచ్చింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అలాగే రైతులందరికీ రుణాలను మాఫీ చేయాల్సిందే. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి కానుకగా డ్వాక్రా రుణాలను కూడా రద్దు చేయాలి. - మాజీ మంత్రి డీకే అరుణ
 
 మెలిక అన్యాయం
 రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని పోటీలు పడి హామీలిచ్చిన టీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు మెలిక పెట్టడమంటే అన్నదాతకు అన్యాయం చేయడమే. అన్ని రుణాలనూ మాఫీ చేయాల్సిందే.
 - ఎంపీ వి.హన్మంతరావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి
 
 కేసీఆర్... మాట నిలుపుకోండి
 2013-14 రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న మీ ప్రకటన రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. దానివల్ల ఒకే పంట రుణం కొందరికి రద్దవుతుంది, మరికొందరికి కాదు. కాబట్టి రూ.లక్ష లోపు రుణాలన్నింటినీ రద్దు చేయండి.
  - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ
మరిన్ని వార్తలు