తెలంగాణ అసెంబ్లీలో రగడ..

7 Nov, 2017 11:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీ అంశం అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. నిరుద్యోగ అంశంపై చర్చకు పట్టుబడుతూ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ఉద్యోగాల భర్తీపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు కోరగా.. స్పీకర్‌ ఇందుకు అనుమతించలేదు. ఈ అంశంపై అధికార-ప్రతిపక్షాల వాగ్వాదంతో గందరగోళం నెలకొంది.

నిరుద్యోగ అంశంపై నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పీకర్‌ను కోరారు. సభ నడిచేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం నుంచి మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయమై సభలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఈ గందరగోళం నడుమ తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేవైఎం కార్యకర్తల అరెస్టు నిరసనగా బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. పబ్లిసిటీ కోసం సభలో హంగామ చేయడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. నిరుద్యోగ సమస్యపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు