సేంద్రియ సాగు

16 Oct, 2018 08:42 IST|Sakshi
ఆదిలాబాద్‌లోని సేంద్రియ పంటల విక్రయ కేంద్రం 

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: ప్రస్తుతం తినే తిండి రసాయనాల మయమైంది.. కూరగాయలు, ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పేమాట.. కానీ అదే కూరగాయలు, ఆకుకూరలు మోతాదుకు మించిన రసాయన ఎరువులతో పండించడం కారణంగా ప్రజలు రోగాల బారిన పడక తప్పడం లేదు. రసాయనాల ఎరువుల ద్వారా ఇటు ప్రజల ఆరోగ్యంతోపాటు రైతుల పెట్టుబడి ఖర్చులూపెరిగిపోతున్నాయి. ఈ దృష్ట్యా కొంతమంది జిల్లా రైతులు ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఆరోగ్యం గురించి వారు ఆలోచిస్తున్నారు. వీరికి కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అండగా నిలుస్తూ ప్రభుత్వం నుంచి సేంద్రియ సాగు కోసం సహాయాన్ని అందిస్తున్నారు. తాను ఆచరణలో ఉండి ఇతరులకు చెబుదామనే ఉద్దేశంతో కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో దాదాపు  ఎకరం స్థలంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసేలా దృష్టి సారించారు. వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సమావేశంలో సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించేలా కృషి చేస్తున్నారు. యువ రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కల్పిస్తున్నారు.

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి
గతంలో సేంద్రియ పద్ధతిలో రైతులు పంటలు సాగు చేసేవారు. దీంతో కూరగాయలు, ఆకుకూరలు, ఇతర పప్పుదినుసులు తీసుకోవడం వల్ల ప్రజల జీవన ప్రమాణం మెరుగుగా ఉండేది. 70 నుంచి 80 సంవత్సరాల వయస్సు వచ్చిన కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా యువతతో పోటీ పడి పనులు చేసే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. పంట పొలాలన్ని రసాయనమయం అయ్యాయి. దీంతోపాటు రైతుల పెట్టుబడి సైతం పెరిగిపోయింది.

గతంలో ఆవుపేడ, గోమూత్రం, వేప కషాయం, తదితర వాటిని కలిపి సేంద్రియ ఎరువులను పంట పొలాల్లోనే తయారు చేసేవారు. ఎలాంటి రసాయనాలు లేకుండానే అన్నిరకాల పంటలను పండించేవారు. కొంత మంది రైతులు ఎలాంటి అవగాహన లేక రసాయన ఎరువులను వాడుతున్నారు. వీటిని చూసిన మిగతా రైతులు సైతం దిగుబడి బాగా వస్తుందనే ఆశతో రసాయన ఎరువుల వాడకాన్ని మొదలు పెట్టారు. క్రమంగా ఈ విధానానికి అలవాటు పడ్డారు. రసాయన ఎరువుల సాగుతో మొదట్లో దిగుబడి వచ్చినా, రానురాను భూసారం తగ్గడం, పెట్టుబడి పెరిగిపోవడంతో రైతులకు సైతం గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. మరోవైపు ప్రజల ఆరోగ్యంపై సైతం ప్రభావం పడే ప్రమాదం ఉంది.

110 ఎకరాల్లో సాగు..
సేంద్రియ పంటల శాస్త్రవేత్త సుభాష్‌ పాలేకర్‌ అడుగుజాడల్లో జిల్లాకు చెందిన కొంతమంది రైతులు నడుచుకుంటున్నారు. ఇంతకాలం రసాయన ఎరువులతో పంటలు సాగు చేయడంతో భూమి సారవంతం కోల్పోయి దిగుబడిపై ప్రభావం చూపింది. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మొదట సాగు వల్ల కొంత దిగుబడి తగ్గినప్పటికీ మూడేళ్ల తర్వాత రైతు అనుకున్న దిగుబడులను పొందుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 110 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు.

జైనథ్‌ మండలం అడ, సాంగ్వి, తలమడుగు మండలం కుచులాపూర్, పల్లి, ఇచ్చోడ మండలం నవేగాం, ఆదిలాబాద్‌రూరల్‌ మండలం వాగాపూర్, ఉట్నూర్‌ మండలం హస్నాపూర్, ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లిలో ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, కంది, శనగ, తదితర పంటలను పండిస్తున్నారు. వీరందరు గత మూడు నాలుగేళ్లుగా ఈ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడి పొందుతున్నారు. పండించిన పంటను విక్రయించడానికి మార్కెట్‌ లేకపోవడంతో వారు ఆశించిన ధర రావడంలేదని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ చొరవతో గత శుక్రవారం జిల్లా కేంద్రంలో సేంద్రియ పంటల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. సాధారణ మార్కెట్‌లో ఉండే ధర కంటే వీటి ధర రూ.20 వరకు అధికంగా విక్రయించుకునే అవకాశాన్ని వీరికి కల్పించారు. రసాయనాల గురించి తెలిసిన వారు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మరిన్ని వార్తలు