ప్రభుత్వ విధానాలతోనే భారీ పెట్టుబడులు 

7 Aug, 2018 02:27 IST|Sakshi
సోమవారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎంవోయూ పత్రాలు మార్చుకుంటున్న  పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సీకే బిర్లా గ్రూప్‌ ప్రతినిధి

ఓరియంట్‌ సిమెంట్‌ విస్తరణతో 12వేల మందికి ఉపాధి అవకాశాలు

పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ వెల్లడి

తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న సీకే బిర్లా గ్రూప్‌

రూ.2 వేల కోట్లతో మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లోని ఓరియంట్‌ సిమెంట్స్‌ విస్తరణ

ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై ప్రశంసలు కురిపించిన బిర్లా

సాక్షి, హైదరాబాద్‌: కొత్త పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉన్న పరిశ్రమలకు మరింత సహకరించడం, మూతపడిన వాటిని తెరిపించడం చేస్తూ.. బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లును తిరిగి తెరిపించడంలో విజయం సాధించామని.. ఇప్పుడు ఓరియంట్‌ సిమెంట్స్‌ విస్తరణకు బిర్లా గ్రూప్‌తో ఒప్పందం కుదరడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్, సీకె బిర్లా సమక్షంలో ఓరియంట్‌ సిమెంట్‌ విస్తరణపై తెలంగాణ ప్రభుత్వంతో సీకే బిర్లా గ్రూప్‌ ఎంవోయూ కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఓరియంట్‌ సిమెంట్స్‌ విస్తరణ ద్వారా రూ.రెండు వేల కోట్ల నూతన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని అన్నారు. దీనిద్వారా సుమారు నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, మరో ఎనిమిది వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. కంపెనీలో స్థానిక యువకులకే ఉద్యోగావకాశాలు దక్కేలా చూడాలని కోరామని, అవసరమైతే ఇందుకోసం ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సీకే బిర్లా విస్తరణ ప్రకటన ద్వారా పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణపై మరింత విశ్వాసం పెరుగుతుందని, మరిన్ని నూతన పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరామన్నారు.  

బిర్లాకు అభివృద్ధి కార్యక్రమాల వివరణ 
తెలంగాణలో గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని, వివిధ ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను సీకే బిర్లాకు మంత్రి కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే ప్రాథమిక సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన తాగునీటి కోసం మిషన్‌ భగీరథ, సాగునీటి కోసం నూతన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. కరెంటు సంక్షోభం వస్తుందనే స్థాయి నుంచి నిరంతరం సరఫరా చేసే దశకు చేరుకున్నామని చెప్పారు. ప్రభుత్వ పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకున్న అనేక కంపెనీలు ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తోపాటు టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాశ్‌రెడ్డి, ఎండీ మల్సూర్‌ తదితరులు పాల్గొన్నారు.  

బిర్లా గ్రూప్‌ విస్తరణ ప్రకటన  
ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ తన భారీ విస్తరణ ప్రణాళికలను సోమవారం ప్రకటించింది. మంచిర్యాలలోని దేవాపూర్‌లో ఉన్న సిమెంట్‌ ఫ్యాక్టరీని సుమారు రూ.రెండు వేల కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నట్లు తెలిపింది. కంపెనీ తుది అనుమతులు పొందే ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని, త్వరలోనే అన్ని అనుమతులు కేంద్రం నుంచి లభిస్తాయని ఎంవోయూ అవగాహన సమావేశంలో గ్రూపు చైర్మన్‌ సీకే బిర్లా తెలిపారు. త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణంపై ఆయన ప్రశంసలు కురిపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ అనేక వినూత్న విధానాలతో పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. పారిశ్రామిక వర్గాల్లో మంచిపేరు సంపాదించుకుందని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు