మానని ఆకలి గాయం..

30 Mar, 2020 08:16 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: ‘అదేదో రోగం వచ్చిందంట..వారం రోజుల నుంచి రోడ్లపై ఎవ్వరూ కనిపిస్తలేరు. చేతిలో ఒక్క పైసా లేదు. తినడానికి తిండి లేదు. ఆ రోగంకారణంగా గుక్కెడు నీళ్లు తాగేందుకు పెట్రోల్‌ బంక్‌లకు వెళ్తుంటే వాళ్లుగెంటేస్తున్నారు. గొంతెండిపోతోంది గుక్కెడు నీళ్లిప్పించడయ్యా’..! అంటూ ‘సాక్షి’తో పలువురు అభాగ్యులువేడుకున్నారు. ‘కరోనా’ వైరస్‌ కారణంగా నగరం స్తంభించింది. పలుప్రాంతాల నుంచి అభాగ్యులెందరో సిటీకి వచ్చి ఆలయాల్లో ప్రసాదాలు, హోటళ్ల వద్ద పడేసినవి తింటూజీవనోపాధి పొందేవారెందరో ఉన్నారు. ‘కరోనా’ మహమ్మారి కారణంగా వారు ఏం తింటున్నారు? ఎక్కడనివసిస్తున్నారు? వారి పరిస్థితులపై ఆదివారం లక్డీకాపూల్‌ నుంచి మియాపూర్‌ వరకు ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో రౌండప్‌ చేసి పలువురిని పలకరించగా.. కన్నీటిపర్యంతమయ్యారు. వారి కన్నీటి గాథలు వారి మాటల్లోనే..! 

నీళ్లు లేవు చేతులు వణికిపోతున్నాయి
నాకు ఉండటానికి గూడు లేదు. తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు కూడా లేదు. వారం రోజులు కంటే ఎక్కువ అవుతుంది నేను అన్నం తిని. కడుపునిండా దాహం తీర్చుకుందామన్నా.. గుక్కెడు నీళ్లు ఇచ్చే వారు కనిపిస్తలేదు. ఒంటిపై చొక్కా లేకపోవడంతో నన్ను అందరూ పిచ్చోడు అనుకుంటున్నారు. వారం రోజులుగా పస్తులుండటంతో కాళ్లు, చేతులు వణికిపోతున్నాయి. అన్నమో రామచంద్రా అంటూ రోడ్లపై తిరిగి తిరిగి యాష్ట వస్తోంది.  – అనంతయ్య, కేపీహెచ్‌బీ  

ఎక్కడుండాలో..
నేను సంగారెడ్డి నుంచి మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చినా. నాకు ఎవరూ లేరు. రోడ్లపై బిక్షాటన చేసుకుంటాను. వచ్చిన కాడికి తింటూ, రాత్రిపూట ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తా. వారం రోజుల నుంచి ఏమైయ్యిందో అర్థం కావట్లేదు.. రోడ్లపై ఎవ్వరూ కనిపిస్తల్లేదు. అన్నం పెట్టేవారు లేరు.. ఎక్కడుండాలో అర్థం అయితలేదు.    – షేక్‌బాబా, ఖైరతాబాద్‌ చౌరస్తా.

ఫంక్షన్‌ హాల్‌ మూసేశారు
నేను యూపీలోని వారణాసి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నా. ఉన్నట్టుండి ఫంక్షన్‌ హాల్‌ బంద్‌ చేస్తున్నాం వెళ్లిపోమని పనోళ్లందర్నీ పంపేశారు. వారం రోజులుగా ఇలా రోడ్లపై అన్నం ఎవ్వరు పెడతారా అంటూ పడిగాపులు గాస్తున్నా. ఎవరిదగ్గరైనా పనిచేద్దామంటే ఎవ్వరూ రానివ్వట్లేదు.  – బనస్వీ, లక్డీకాపూల్‌

పని ఇప్పించండి 
పని లేదు సారూ.. మీకు తెలిసి ఏదైనా పని ఉంటే ఇప్పించండి చేసుకుంటాను. చేతిలో డబ్బులు లేక బిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చింది. వారం రోజులుగా అన్నం కోసం, మంచినీళ్లు కోసం పరుగులు పెడుతున్నాను. మంచిగా పనిచేసుకుంటాను సాయం చేయండి సారూ..!    – సతీష్, బంజారాహిల్స్‌

బండ్లు కడిగే కొలువు పోయింది
నేను నాందేడ్‌ నుంచి వచ్చి ఇక్కడ నిమ్స్‌ హాస్పిటల్‌లో బండ్లు కడిగే పనిచేస్తుంటా. కొద్దిరోజులుగా పనికి రావట్లేదు. నా కొలువు పోయిందేమో అనుకుంటున్నా. అందుకే ఇలా బస్టాప్స్‌లలో కొద్దిసేపు నిద్రిస్తున్న. నిమ్స్‌ హాస్పిటల్‌లో పేషెంట్స్‌ కోసం వచ్చిన వారు పెడితే తింటున్నా, లేదంటే పస్తుండటమే అవుతుంది. – ఉస్మాన్, ఎర్రమంజిల్‌

ఇంటికెళ్లిపోతా.. సారూ..
నేను జార్ఖండ్‌ నుంచి ఇక్కడకు రాళ్లు కొట్టే పనికి వచ్చా. ఏదో వైరస్‌ వచ్చిందని పని ఆపేశారు. వారం రోజులుగా తిండీ తిప్పలు లేక కడుపు కాలిపోతుంది. తిండీ తిప్పలు లేక ఇక్కడ ఉండలేకపోతున్నాను.. నన్ను మా ఇంటికి పంపండి సారూ. మంచినీళ్లు కూడా దొరకట్లేదు. పూట తింటే పూట పస్తుండాల్సిన దుస్థితి వచ్చింది.       – గుణశర్మ, పంజాగుట్ట

మరిన్ని వార్తలు