అందరు ఉన్నా అనాథగా..

16 Apr, 2018 10:17 IST|Sakshi
అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఎండీఆర్‌ యువ సేన (ఫైల్‌)

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్నఅనాథ శవాల సంఖ్య

కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ దొరకక పోలీసులు అవస్థలు

స్వచ్ఛంద సంస్థలు, మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు

ఎక్కడి నుంచి వచ్చారో, ఏమైందో తెలియకుండా కొందరు ఆఖరికి అనాథ శవాలై మిగులుతున్నారు. కుటుంబ సభ్యుల చేత అంతిమ సంస్కారానికి నోచుకోని అభాగ్యులుగా లోకం విడుస్తున్నారు. రోజు రోజుకు జిల్లాలో లభ్యమవుతున్న అనాథ శవాల సంఖ్య పెరుగుతోంది. వారి కుటుంబ సభ్యల ఆచూకీ దొరకక మృతదేహాలను ఏమి చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని సార్లు స్వచ్ఛంద సంస్థలు సభ్యులు మందుకు వచ్చి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకుంటున్నారు.  

సంగారెడ్డి క్రైం: కోటిశ్వరుడు నుంచి నిరుపేద వరకు ఎవరైనా తన అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల చేతుల మీదే జరగాలని కోరుకుంటారు. కానీ అనుకోని సంఘటనలతో అనాథలుగా మారిన వారు, ప్రయాణంలో మార్గమధ్యలో ప్రమాదాల బారిన పడిన వారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఇందుకు నోచుకోవడం లేదు. అందరు ఉన్నా చివరి మజిలీ నాటికి అనాథలవుతున్నారు.

పట్టించుకునే వారు లేక..
కుటుంబానికి భారమై కొందరు, మతి స్థిమితం లేక కొందరు, నా అనే వారు లేక మరి కొందరు రోడ్ల పక్కన, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఖాళీ ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. వీరంతా దుర్భర పరిస్థితుల్లో జీవితాన్ని వెల్లదీస్తున్నారు. తిండి లేక, అనారోగ్యానికి గురైనా చికిత్స అందించే వారు లేక ప్రాణాలు వదులుతున్నారు. ఎవరైనా గమనించి పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందికి సమాచారం అందిస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి మార్చురిలో శవాలను ఉంచుతున్నారు. సంబంధికులు వస్తే మృతదేహాన్ని అప్పగిస్తున్నారు. లేకుంటే స్థానిక స్వచ్ఛంద సంస్థల సభ్యుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌తరహాలో చేస్తే మేలు..
రాష్ట్ర జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లో సంచరిస్తున్న యాచకులు, అనాథలు, మతస్థిమితం లేని వారిని జైళ్లలో ఆశ్రమం కల్పిస్తున్నారు. ఇదే  విధానాన్ని జిల్లాలలో కూడా అమలు చేస్తే అనాథలకు మేలు కలుగుతుందని పలువురు ఆశిస్తున్నారు.

కలచివేసిన ఘటన
పటాన్‌చెరు బస్టాండ్‌లో  ఈ నెల ఏప్రిల్‌ 4న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో ఆ అనాథ శవం కుళ్లి పోయింది. ఈ ఘటన ఆ చుట్టు పక్కల వారిని ఎంతో కలచివేసింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రచురించడంతో పట్టణంలోని ఎండీఆర్‌ యువసేన సభ్యులు స్పందించారు. శవానికి అంత్యక్రియాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.

  బంధువుల వివరాల కోసం యత్నిస్తాం..
అనాధ శవాల ఆచూకీ తెలిస్తే వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రులల్లో భద్రపరుస్తున్నాం. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆచూకీ తెలిస్తే శవాన్ని వారికి అప్పగిస్తున్నాం. లేని పక్షంలో మున్సిపాలిటీ వారికి సమాచారం అందిస్తాం. వారే శవాన్ని ఖననం చేస్తారు.  – చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ

మరిన్ని వార్తలు