నేనున్నా.. చెల్లెమ్మా..

25 Jun, 2016 01:25 IST|Sakshi
నేనున్నా.. చెల్లెమ్మా..

అనాథ యువతికి ఎమ్మెల్యే రసమయి భరోసా
ఏడాదిపాటు ట్రినిటీలో చదివించేందుకు హామీ
దుస్తులు, పుస్తకాలు కొనిచ్చి కళాశాలలో చేర్పించిన ఎమ్మెల్యే


ఇల్లంతకుంట :  ‘అమ్మనాన్నలు లేరని చింతించకు... అనాథ అని బాధపడకు. ఆపదొచ్చినా... పండగొచ్చినా నేనున్నా..’ అంటూ మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ఓ అనాథ యువతికి అండగా నిలిచారు. మండలంలోని వంతడ్పులకు చెందిన చింతకింది బాలయ్యకు ఆంజనేయులు, అనిత సంతానం. బాలయ్య 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. తల్లి ఎటో వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆంజనేయులు, అనిత అనాథలయ్యూరు.

కూలీ పనులు చేస్తూ చెల్లెను చదవించాడు ఆంజనేయులు. ఆమె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ పూర్తి చేసి 446 మార్కులు సాధించింది. నాలుగు నెలల క్రితం ఆంజనేయులు భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకోవడంతో అనిత ఒంటరిదైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిత ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనితకు తానున్నానని భరోసా ఇచ్చాడు. ఆమె చదువుకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించి వెంటనే కరీంనగర్‌లోని ట్రినిటీ కళాశాలలో చేర్పించారు.

అనితకు కావాల్సిన దుస్తులు, పుస్తకాలతోపాటు రూ.5వేల అందించారు. ఆమెను తన చెల్లెగా చూస్తానని, ఏ కష్టం వచ్చినా.. పండగలొచ్చినా.. తన ఇంటికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనాథ బాలికను చేరదీసిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గుడిసె ఐలయ్య, సెస్ డెరైక్టర్ వుట్కూరి వెంకటరమణారెడ్డి, సర్పంచ్ కట్ట వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా