ఆరోగ్య ప్రదాయినికి ఆయుష్షు!

8 Jul, 2019 09:27 IST|Sakshi

ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి సొబగులు

రూ.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం

ఏర్పాట్లు చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ

ఆర్కియాలజీ విభాగానికి పునరుద్ధరణ పనులు

భవన జీవితకాలం 25 ఏళ్లకు పైగా పెంపు!

సాక్షి,సిటీబ్యూరో: ఆరోగ్యం చెడిపోయి పోతాయనుకున్న ప్రాణాలు సైతం ఆ ఆస్పత్రికి వెళితే నిలిచిపోతాయని రోగుల నమ్మకం. ఎన్నో ప్రయోగాలు, మరెన్నో అద్భుతాలకు వేదిక.. లక్షలాది మంది రోగుల ఆరోగ్య ప్రదాయిని ఉస్మానియా ఆస్పత్రి. చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఆస్పత్రి పాత భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. తరచు పెచ్చులూడి పడుతుండటంతో ఇప్పటికే రెండో అంతస్తును ఖాళీ చేయించారు. దాన్ని కూల్చివేసి అక్కడ రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం 2014లోనే సంకల్పించింది. ప్రతిపక్షాలు, చరిత్రకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కూల్చివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పాత భవనాన్ని ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆర్కియాలజీ విభాగానికి పంపింది. ఈ భవనానికి మెరుగులు దిద్దడంవల్ల మరో 25 ఏళ్ల వరకు ఆ కట్టడానికి ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ వైపు పాత భవనాన్ని ఆధునికీకరిస్తూనే.. మరోవైపు ఇదే ప్రాంగణంలో కొత్తగా మరో నాలుగు బ్లాకులు నిర్మించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవల ప్రకటించారు. పునరుద్ధరణ   చర్యల్లో భాగంగా దెబ్బతిన్న రూఫ్‌టాప్‌ను సరిచేయడం, గోడలపై మొలిచిన చెట్లను తొలగించడం, గోడల పగుళ్లును బాగుచేయడం, వాటర్‌ ఫ్రూఫింగ్‌ చేసి లీకేజీలను అరికట్టడంతో పాటు, డ్రైనేజీ లైన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్డలను పూర్తిగా పునరుద్ధరించడం వంటివి చేపడతారు. తద్వారా ఈ భవనాన్ని మళ్లీ వినియోగంలోకి తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

చారిత్రక నేపథ్యం ఇదీ..
గోల్సావాడి.. మూసీనది ఒడ్డున వెలిసిన ఓ బస్తీ. పాశ్చాత్య ప్రపంచంలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వైద్యాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసింది ఈ బస్తీయే. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం నసీరుద్దౌలా బ్రిటిష్‌ తరహా వైద్యం చేసే ఆస్పత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతో పాటు బోధనా పద్ధతులను, పాఠ్య గ్రంథాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించగా ఐదో నవాబు అఫ్జలుద్దౌలా హయాంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది. 1866 నాటికి అది ‘అఫ్జల్‌గంజ్‌ ఆస్పత్రి’గా వైద్య సేవలు ప్రారంభించింది. అప్పటి వరకు కంటోన్మెంట్‌లోని బ్రిటిష్‌ సైనికులకు మాత్రమే అందిన విదేశీ వైద్యం ఈ ఆస్పత్రి ప్రారంభంతో ఇక్కడి సామాన్యులకు కూడా చేరువైంది. కానీ ఆ ఆస్పత్రి 1908లో వచ్చిన మూసీ వరదల్లో నేలమట్టమైంది. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ పాలనా కాలంలో చోటుచేసుకున్న విషాదమిది. తర్వాత కొంత కాలానికే ఆయన కూడా కాలధర్మం చేశారు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అఫ్జల్‌గంజ్‌ ఆస్పత్రి స్ఫూర్తిని బతికించాలని భావించి.. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ విన్సెంట్‌ మార్గదర్శకత్వంలో సుమారు 27 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. 

రూ.50 వేల ఖర్చుతో నిర్మాణం
ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి 1918లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్ల గ్రానైట్, సున్నం కలిపి కట్టించిన ఈ పటిష్టమైన భవనం ఇండో పర్షియన్‌ శైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన రాజస్థానీ, గ్రీక్, రోమన్, శైలిలో దీన్ని కట్టారు. సుమారు తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం కూలీలతో ఐదేళ్ల పాటు శ్రమించి కట్టారు. ఆరోజుల్లో ఈ భవన నిర్మాణానికి రూ.50 వేల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. 1925లో ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఇండో పర్షియన్‌ శైలిలో 110 అడుగుల ఎత్తయిన విశాలమైన డోమ్‌లు ఆస్పత్రికి ప్రత్యేక ఆకర్షణ. చార్మినార్‌లోని మినార్‌లను పోలిన నిర్మాణాలను ఆస్పత్రి భవనంపై కట్టారు. డోమ్‌లను కేవలం కళాత్మకత దృష్టితోనే కాకుండా రాత్రి వేళ్లలో విద్యుత్‌ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువగాలి, వెలుతురు వచ్చేలా నిర్మించారు.

ప్రపంచంలోతొలి ‘క్లోరోఫామ్‌’ చికిత్స ఇక్కడే
ఉస్మానియా ఆస్పత్రి అనేక అద్భుతాలుఆవిష్కరణలకు వేదిక. ఆస్పత్రి సూపరింటిండెంట్‌ ఎడ్వర్డ్‌ లారీ నేతృత్వంలోని వైద్యబృందం ప్రపంచంలోనే తొలిసారి క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్స చేశారు. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా ఇక్కడికే వచ్చేవారు. అంతేకాదు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స కూడా ఇక్కడే జరిగింది. ఎంతో మంది గొప్ప వైద్యులను తీర్చిదిద్దే కేంద్రంగా ఆస్పత్రి అభివృద్ధి చెందింది. డాక్టర్‌ ఎడ్వర్డ్‌ లారీ, డాక్టర్‌ గోవిందరాజులు నాయుడు, డాక్టర్‌ సత్యవంత్‌ మల్లన్న, డాక్టర్‌ హార్డికర్, డాక్టర్‌ సర్‌ రోనాల్డ్‌ రాస్, వంటి ప్రముఖ వైద్యులు ఆస్పత్రిలో సేవలు అందించా రు. 1846లోనే డాక్టర్‌ విలియం మెక్లిన్‌ నేతృత్వంలో నిజామ్స్‌ మెడికల్‌ స్కూల్‌ వైద్య విద్యాబోధన ప్రారంభమైంది. 

ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి కథ ఇదీ..
నిర్మాణానికి ప్రతిపాదన    1918
నిర్మాణం పూర్తయింది     1925
విస్తీర్ణం    27 ఎకరాలు
నిర్మాణ ఖర్చు    రూ.50 వేలు
నిర్మాణ శైలి    ఇండో,పర్షియన్‌తొలిరోజుల్లో పడకలు    450  
ప్రస్తుత పడకలు     1100
ఓపీ రోజుకు (సగటున)    2000 నుంచి 2500 మంది
ఇన్‌ పేషెంట్ల సంఖ్య    200–300
మైనర్‌ ఆపరేషన్లు(రోజుకు)    120–135
మేజర్‌ ఆపరేషన్లు    30–35
మొత్తం విభాగాలు    33
సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు    7

మరిన్ని వార్తలు