కొలువులు కొట్టడంలో దిట్టలు ఓయూ విద్యార్థులు

14 Oct, 2019 09:45 IST|Sakshi

చదువులమ్మ చెట్టు నీడలో లక్ష్యాల సాధన   

ఉద్యోగాల వేటలో ఊతమిచ్చినవిశ్వవిద్యాలయం

ఉన్నత విద్య అభ్యసిస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధం

ఇటీవల విడుదలైన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఫలితాలు    

3 వేల కానిస్టేబుల్, 200 ఎస్‌ఐ పోస్టులు కైవసం   

అహరహరం శ్రమించి నౌకరీసాధించామని వెల్లడి  

ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంవిద్యాపరంగానే కాకుండా ఉద్యోగాల సాధనకు ఊపిరిలూదుతోంది. దశాబ్దాల తన కీర్తి చరితను నలుదిశలా చాటుతోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో సుమారు 3 వేల మంది కానిస్టేబుళ్లుగా, 200 మంది ఎస్‌ఐలుగా ఇటీవల నియమితులయ్యారు. తమ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చుకున్నారు. యువతరానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇంత మంది ఓయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందడం ఇదేతొలిసారి కావడం గమనార్హం.     

ఉస్మానియా యూనివర్సిటీ: వారంతా ఉన్నత విద్య పూర్తి చేశారు. తాము కోరుకున్న ఉద్యోగం రాకున్నా తొలుత ఏదో ఒక దాంతో ఉపాధి పొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా వేలాది మంది ఓయూ విద్యార్థులు పోలీసు ఉద్యోగాలకు పోటీపడ్డారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా సివిల్, ఏఆర్, సీపీఎల్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎఫ్, ఫైర్‌ తదితర విభాగాల్లో 16,925 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు, 1,275 ఎస్‌ఐ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో క్యాంపస్‌తో పాటు ఓయూ చుట్టూ ఉన్న మాణికేశ్వర్‌నగర్, విద్యానగర్, తార్నాక, నల్లకుంట, హబ్సిగూడ, రాంనగర్, మెట్టుగూడ, లాలాగూడ, అంబర్‌పేట్, ఉప్పల్‌ తదితర ప్రాంతాలకు చెందిన ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు ఇక్కడి గదుల్లో ఉంటూ యూనివర్సిటీ లైబ్రరీలో రోజుల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఓయూ క్రీడా మైదానాల్లో ఫిజికల్‌ టెస్టులకు ప్రాక్టీస్‌ చేశారు. పోలీసు ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉండటం విశేషం.

పేదరికాన్ని జయించి.. 
ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించినవారు పేదరికం కారణంగానే చిరు ఉద్యోగాలకు సైతం పోటీపడుతున్నారు. వ్యవసాయం, వ్యవసాయ కూలీలు, ఇతర పనులు చేసుకునే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీ వరకు చదవాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడాలి. ఉన్నత విద్యను పూర్తి చేసినా ఉద్యోగం రాకుంటే కుటుంబానికి ఆసరా ఉండదు. ఉద్యోగం వస్తేనే విద్యావంతులకు ఒక గుర్తింపు ఉంటుందనే భావన వీరిలో పెరిగింది.  

ఉపాధే లక్ష్యంగా..
తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన పేద విద్యార్థులు ఓయూ క్యాంపస్‌లో చదువుతున్నారు. పీజీ, పీహెచ్‌డీలు పూర్తి చేసినా అనుకున్న ఉద్యోగం లభించడంలేదు. వీఆర్‌ఏ, వీఆర్‌ఓ మొదలు రైల్వే గ్యాంగ్‌మన్, కండక్టర్, క్లర్క్, కానిస్టేబుల్, అటెండర్‌ తదితర కింది స్థాయి ఉద్యోగాలకు పోటీపడి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడుతున్నారు. ఇలా ఓయూలో విద్యనభ్యసిస్తున్న వారు ఉపాధే లక్ష్యంగా శ్రమించారు. కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు ఎంతో ఓపికగా, కష్టపడి చదివారు. రోజుకు 6 నుంచి 10 గంటల వరకు లైబ్రరీకే పరిమితమయ్యారు. కొందరు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అన్ని పోటీ పరీక్షలకు చదివేందుకు ఓయూ క్యాంపస్‌ అనుకూలంగా ఉండటం వీరికి అనుకూలమైంది. లైబ్రరీతో పాటు ల్యాండ్‌స్కేఫ్‌ గార్డెన్, క్యాంపస్‌లో విస్తరించిన చెట్ల నీడ చదువుకునేందుకు వీలుగా మారాయి. ఎట్టకేలకు తమ కల ఫలించి, ఉద్యోగాలు సాధించామని ఆనందం వ్యక్తంచేశారు. ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన పలువురు ఇలా అభిప్రాయపడ్డారు.

సమాజ సేవ చేయాలని..
సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామం. అమ్మానాన్నలు రవీందర్‌రెడ్డి, ధనమ్మ. వృత్తి వ్యవసాయం.  వారు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. నేను ఓయూలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి నకిరేకల్‌లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాను. ఎస్‌ఐ కావాలనే లక్ష్యంతో నాలుగు నెలల ఓయూలో పోటీ పరీక్షలకు చదివి ఉద్యోగం సాధించాను. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఎస్‌ఐ ఉద్యోగం సాధించాను.    – సతీష్‌రెడ్డి  

తొలి ప్రయత్నంలోనే..
మాది సిద్దిపేట జిల్లా బెజంకి మండలం లక్ష్మీపూర్‌ గ్రామం. తల్లిదండ్రులు రామిరెడ్డి, సత్యవతి.  నన్ను ఎస్‌ఐగా చూడాలని వారి కల. అమ్మానాన్నల స్వప్నాన్ని సాకారం చేసేందుకు తొలి ప్రయత్నంలోనే నేను ఎస్‌ఐ ఉద్యోగం సాధించాను. భవిష్యత్‌లో సివిల్స్‌ కొట్టి ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ను కావాలనుకుంటున్నా. ఓయూ క్యాంపస్‌ కాలేజీలో ఎంసీఏ పూర్తి చేసి వివిధ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం చదువుతున్నాను. మొదటి ప్రయత్నంలోనే ఎస్‌ఐ ఉద్యోగం లభించినందుకు ఆనందంగా ఉంది.    – తోట మహేందర్‌రెడ్డి  

పెద్దనాన్న కుమారులే స్ఫూర్తి..
మాది సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల గ్రామం. నేను ఓయూ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎంసీఏ పూర్తి చేశాను. అమ్మానాన్నలు వెంకట్‌రెడ్డి, ఉపేంద్ర వ్యవసాయం చేస్తూ నన్ను చదివించారు. మేము ఇద్దరం ఆడపిల్లం. మా పెద్దనాన్న కుమారులిద్దరూ ఎస్‌ఐలే. వారిని స్ఫూర్తి తీసుకొని నేను కూడా ఎస్‌ఐ కావాలని ఎంతో ఇష్టంతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం పట్ల ఎంతో గర్వపడుతున్నాను. – నర్రెడ్డి కీర్తి  

ఎస్‌ఐ ఉద్యోగం సాధించా.. 
మాది వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి. నిరుపేద కుటుంబం. నేను పుట్టిన ఏడాదికే నాన్న చనిపోయారు. నాకిద్దరు అక్కలు ఉన్నారు. అమ్మ కూలిపనులు చేస్తూ మమ్మల్ని చదివించింది. ఓయూలో గణితశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఉద్యోగం కోసం ఐదారేళ్లుగా చదువుతున్నారు. గ్రూప్‌– 1 ఉద్యోగం సాధించాలని కోచింగ్‌ కూడా తీసుకున్నా. చివరకు ఎస్‌ఐ ఉద్యోగం వచ్చింది.  భవిష్యత్‌లో గ్రూప్‌– 1, 2 ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. రెండో అక్క కానిస్టేబుల్‌. రోజుకు 10 గంటలు చదివి ఎస్‌ఐ ఉద్యోగం సాధించాను. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. – కుమ్మరి వరలక్ష్మి 

మరిన్ని వార్తలు