ఆ నాలుగు గంటలు

8 Aug, 2014 03:47 IST|Sakshi

 ఆదిలాబాద్ రిమ్స్ : సరిగ్గా సంవత్సరం క్రితం.. ఇదే ఆగస్టు నెల.. అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు ఐదున్నర గంటలపాటు రిమ్స్‌లో కలియతిరిగి హడలెత్తించారు.. ఇప్పుడు మళ్లీ అదే పునరావృతమైంది. ఇప్పుడు బాబు కాదు.. కలెక్టర్ జగన్మోహన్. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆస్పత్రిలోని అన్ని వార్డులు తిరిగారు.

రిమ్స్ అధికారులకు సమాచారం లేకుండా రిమ్స్‌కు వచ్చి రోగులను సేవల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకున్న డెరైక్టర్, మిగతా అధికారులు అక్కడికి చేరుకున్నారు. రోగుల రిజిస్టర్, కేషీట్‌లు పరిశీలించారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని సూచించారు. కలెక్టర్ వెంట రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ శశిధర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్‌చంద్ర, ఆర్‌ఎంవో శోభపవార్ ఉన్నారు.

 అణువణువూ తనిఖీ
 ముందుగా కలెక్టర్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఫిమేల్ ఆర్థ్రోపెడిక్ వార్డులో రిజిష్టర్‌ను పరిశీలించగా డిశ్చార్జ్ చేసిన వారి వివరాలు లేకపోవడంతో స్టాఫ్ నర్సులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో సూపర్‌వైజర్‌పై మండిపడ్డారు.

 మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ ఏఈని ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డెరైక్టర్‌కు సూచించారు. రేడియోలజీ విభాగంలో ఒక్కరే రేడియోలజిస్టు ఉండటంతో మరొకరిని నియమించాలని ఆదేశించారు. పిల్లల వార్డుకు వచ్చే పిల్లల కోసం మినీపార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని డెరైక్టర్‌కు సూచించారు. ఆస్పత్రి పరిసర ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు.

అనంతరం రిమ్స్ వైద్య కళాశాలలలోని డెరైక్టర్ చాంబర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో అవసరమున్న పరికరాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని త్వరలో మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు.

 ప్రొజేరియా చిన్నారికి పరామర్శ
 రిమ్స్ చిల్డ్రన్స్ వార్డులో ప్రొజేరియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కవితను కలెక్టర్ జగన్మోహన్ పరామర్శించారు. త్వరలో వ్యాధి నయమవుతుందని, బాధపడకుండా ధైర్యంగా ఉండాలని చిన్నారికి కలెక్టర్ ధైర్యం చెప్పారు. వ్యాధి నయమయ్యేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని రిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశించారు.

 సస్పెన్షన్‌కు ఆదేశం
 ఆస్పత్రిలో లోపించిన పారిశుధ్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వార్డులో చూసినా అపరిశుభ్రతే కనిపిస్తోందని, ఈ నిర్లక్ష్యానికి కారణమైన హెల్త్‌సూపర్‌వైజర్‌తోపాటు తనకింద పనిచేసే ఐదుగురు సూపర్‌వైజర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రోగులతోపాటు ఆస్పత్రిలోని పరిశుభ్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత వైద్యులపై కూడా ఉందన్నారు. ఆస్పత్రిలో సక్రమంగా పనిచేయకుంటే ఎవరైనా ఇంటికి వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. ఆస్పత్రిలో రోగులకు అందించే వైద్యసేవలపై, పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తప్పవన్నారు.

మరిన్ని వార్తలు