జేఈఈ దరఖాస్తుల్లో ‘అదర్స్’ ఆప్షన్

30 Jan, 2015 02:34 IST|Sakshi

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కోసం మార్పులు చేసిన సీబీఎస్‌ఈ

సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు స్థానం లభించింది. అయితే ఇప్పటికిప్పుడే తెలంగాణ ఇంటర్మీయట్ బోర్డు పేరుతో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం సాధ్యం కానందున.. విద్యార్థుల కోసం ‘అదర్స్ (ఇతరులు)’ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచుతున్నామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు విద్యార్థులంతా ‘అదర్స్’గా విద్యార్హతల ఆప్షన్‌ను మార్చుకోవాలని వివరించింది.

కొద్దిరోజుల్లో తాము సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి.. అదర్స్ పేరుతో ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులందరినీ తెలంగాణ బోర్డు కిందకు తీసుకుంటామని  వెల్లడించింది. ఈ మేరకు జేఈఈకి దరఖాస్తు చేసుకున్న తెలంగాణ విద్యార్థులంతా వెబ్‌సైట్లో తమ ఆప్షన్‌ను ‘అదర్స్’గా ఈ నెల 31లోగా మార్పు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. ఈ మేరకు ఆన్‌లైన్ దరఖాస్తుల్లో సీబీఎస్‌ఈ గురువారం మార్పులు చేసిందని విద్యా మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఏప్రిల్‌లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల్లో.. ఏ బోర్డు నుంచి ఇంటర్/12వ తరగతి చదువుతున్నారనే సమాచారాన్ని నమోదు చేయాల్సిన ఆప్షన్లలో నవంబర్‌లో దరఖాస్తుల సమయంలో తెలంగాణ ఇంటర్ బోర్డును చేర్చలేదు. దీంతో రాష్ట్ర విద్యార్థులంతా ఏపీ బోర్డు ఆప్షన్‌తో దరఖాస్తు చేసుకున్నారు. దీనివల్ల తెలంగాణ బోర్డు నుంచి ఇంటర్ పూర్తిచేసే విద్యార్థులకు జేఈఈ మెయిన్ తుది ర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకిచ్చే 40 శాతం వెయిటేజీని కోల్పో యే పరిస్థితి రావడంతో వారంతా ఆందోళన చెందారు.

దీనికితోడు ఆన్‌లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం ఇచ్చినా.. ఆ ఆప్షన్లలోనూ తెలంగాణ ఇంటర్ బోర్డును చేర్చలేదు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఇంటర్ బోర్డు బుధవారమే సీబీఎస్‌ఈకి లేఖ రాసింది. ప్రభుత్వంతో పాటు బోర్డు అధికారులు గురువారం సీబీఎస్‌ఈ అధికారులతో మాట్లాడారు. తెలంగాణ బోర్డును చేర్చకపోతే రాష్ట్ర విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన సీబీఎస్‌ఈ వెంటనే జేఈఈ మెయిన్ దరఖాస్తుల సవరణ లింక్‌లో అదర్స్ ఆప్షన్‌ను అందుబాటులోకి ఉంచింది.

మరిన్ని వార్తలు