రండి..సర్దుకుపోదాం

11 Sep, 2018 11:53 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రచారాన్ని ఏకోన్ముఖంగా తీసుకెళ్లే వ్యూహాన్ని త్వరలో ఖరారు చేయనున్నారు. ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో ఏకంగా ముగ్గురు నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవులు దక్కగా, తాజాగా టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డికి నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అయితే నేతల నడుమ సమన్వయం కరువై కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నట్లు పార్టీ గుర్తించింది. పార్టీ అధినేత కేసీఆర్‌ ఈ నెల 7న గజ్వేల్‌ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కాగా, త్వరలో మరోమారు భేటీ అయ్యే అవకాశం ఉంది. దీనికి ముందే గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలో మండలాల వారీగా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: శాసన సభకు పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ టికెట్ల కేటాయింపు అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితిలో అక్కడక్కడా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న పార్టీ అభ్యర్థులు అసంతృప్త నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. అయితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేతల వివరాలను ఇప్పటికే పార్టీ నేతల ద్వారా సేకరించారు. అందరినీ కలుపుకొని పోయేందుకు అభ్యర్థులు అనుసరించాల్సిన వైఖరిపైనా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రి దిశా నిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో అక్కడక్కడా పార్టీ నేతల నుంచి వస్తున్న అసమ్మతిని సర్దుబాటు చేసే దిశగా టీఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోంది.

ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో జహీరాబాద్‌ మినహా మిగతా అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీఆర్‌ఎస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతల నుంచి అభ్యర్థుల ప్రకటనపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ సోమవారం విలేకరుల సమావేశంలో అభ్యర్థిని మార్చాలని డిమాండు చేశారు. పటాన్‌చెరులో టికెట్‌ ఆశించి భంగపడిన గాలి అనిల్‌కుమార్‌ తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. నారాయణఖేడ్‌లో భూపాల్‌రెడ్డికి పార్టీ టికెట్‌ ఇవ్వడంపై టీఆర్‌ఎస్‌ నేతలు దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు.

ఇతర నియోజకవర్గాల్లోనూ అక్కడక్కడా పార్టీ అభ్యర్థులపై స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతిని ఆదిలోనే తుంచి వేయాలని భావిస్తున్న పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా అసంతృప్త నేతలు, కార్యకర్తల వివరాలు సేకరిస్తోంది. పనిలోపనిగా పార్టీ అభ్యర్థిపై అసమ్మతి ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులపైనా దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థులు ఎదుర్కొంటున్న అసమ్మతిపై ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు కూడా వచ్చింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో మంత్రి హరీశ్‌రావు పార్టీ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉండటంతో, అసమ్మతి వ్యవహారాన్ని తేల్చే బాధ్యతను భుజాలకెత్తుకున్నట్లు కనిపిస్తోంది.

నియోజకవర్గాల వారీగా వివరాల సేకరణ

  • నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి సారించిన మంత్రి హరీశ్‌రావు.. అసమ్మతి నేతలతో సంప్రదింపుల బాధ్యతను ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మురళీయాదవ్‌కు అప్పగించారు. సోమవారం రాత్రి నారాయణఖేడ్‌లో మకాం వేసిన మురళీ యాదవ్‌ వివిధ మండలాలకు చెందిన పార్టీ అసంతృప్త నేతలతో భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని మంత్రి హరీశ్‌ నివాసంలో పార్టీ నేతలతో సమావేశం జరగనుంది.
  • నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అసంతృప్త నేతలు కూడా మంత్రి హరీశ్‌తో మంగళవారం మధ్యాహ్నం సమావేశం కానున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని కొందరు అసంతృప్త నేతలకు సమాచారం కూడా అందింది. 
  • పటాన్‌చెరు నియోజకవర్గ నేతలకు కూడా మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు  రావాల్సిందిగా ఆదేశాలు అందినట్లు తెలిసింది. 
  • సంగారెడ్డి నియోజకవర్గ నేతలతోనూ ప్రత్యేకంగా త్వరలో సమావేశమయ్యే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
  • ఉమ్మడి మెదక్‌ జిల్లా పార్టీ అభ్యర్థులతో ఆదివారం రాత్రి మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన సమావేశంలోనూ అసమ్మతి, అసంతృప్త నేతల వ్యవహారమే ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇతర పార్టీలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి ఎక్కువ సమయం ఉన్నందున విభేదాలను తొలగించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా హరీశ్‌ ఆదేశించినట్లు సమాచారం.
మరిన్ని వార్తలు