అట్టుడికిన ఓయూ

23 Jul, 2014 02:13 IST|Sakshi
అట్టుడికిన ఓయూ

వేర్వేరు ప్రాంతాల్లో పలు విద్యార్థి సంఘాల ఆందోళనలు
 
హైదరాబాద్ : ర్యాలీలు, రాస్తారోకోలు, అరెస్టులతో ఓయూ క్యాంపస్ ఐదు రోజులుగా ఆందోళనలకు కేంద్రంగా మారింది. మంగళవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలు అంశాల పరిష్కారానికి వేర్వేరుగా ఆందోళనలు చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దని బీజేవైఎం, ఎంఎస్‌ఎఫ్, ఏబీవీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ(విజృంభణ) ఐదో రోజు లైబ్రరీని బహిష్కరించి ర్యాలీ చేపట్టాయి. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఎదుట సమావేశమై భవిష్యత్తు పోరాటం కోసం కొత్తగా తెలంగాణ నిరుద్యోగుల సంఘర్షణ సమితిని స్థాపించారు. పాలస్తీనాపై ఇజ్రాయిలు దాడులను ఖండిస్తూ పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆర్ట్స్ కళాశాల ఎదుట అమెరికా, ఇజ్రాయెల్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

జమ్ముకాశ్మీర్‌పై ఎంపీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను చులకన చేసి మాట్లాడిన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి దిష్టిబొమ్మను తార్నాక చౌరస్తాలో ఏబీవీపీ కార్యకర్తలు దహనం చేశారు. ఎన్‌సీసీ గేటు వద్ద ఓయూ విద్యార్థి జేఏసీ(గద్దెల అంజిబాబు వర్గం) ప్రైవేటు కోచింగ్ సెంటర్ల దిష్టిబొమ్మను దహనం చేశారు.

మా జీవితాల్లో చీకట్లు నింపొద్దు :  కాంట్రాక్టు లెక్చరర్ల వినతి

తమ జీవితాల్లో చీకట్లు నింపవద్దని విద్యార్థులను తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం కోరింది.  ఉద్యోగాలు క్రమబద్దీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని సంఘం అధ్యక్షుడు కనకచంద్రం యాదవ్ విన్నవించారు. సచివాలయంలో హోంమంత్రి నాయిని న రసింహారెడ్డిని కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు