సమన్వయంతో ముందుకు వెళ్దాం..

10 Jul, 2014 23:44 IST|Sakshi
సమన్వయంతో ముందుకు వెళ్దాం..

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. గ్రామ స్థాయిలో నెలకొన్న సమస్యల్ని సూక్ష్మ పరిశీలనతో గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పించింది. గ్రామం, పట్టణం, మండలం, జిల్లా స్థాయిల్లో ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేయాలి.’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రణాళికల రూపకల్పనపై గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశానికి మంత్రి మహేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రణాళికలను ఏ విధంగా తయారు చేయాలి.. ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి అభిప్రాయాలను సేకరించారు.

 ప్రజాప్రతినిధుల సూచనలు వారి మాటల్లోనే..
 పాఠశాల ల్లో తాగునీటి వసతి మెరుగుపర్చాలి
 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అంతంతమాత్రంగానే ఉంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ.. తాగునీటి వసతి మాత్రం కల్పించలేదు. దీంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తాగాల్సివస్తోంది. టాయిలెట్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. తాజాగా రూపొందించే ప్రణాళికలో ఆయా అంశాలకు ప్రాధాన్యం కల్పిస్తే బాగుంటుంది.- జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
 
 వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం
 గ్రామాల్లో మెజార్టీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాజా ప్రణాళికలో వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాగు పనులు ముమ్మరమైనప్పుడు, దిగుబడులు వచ్చే సమయంలో కూలీలు లేక రైతులు నష్టపోతున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో చాలావరకు అక్కరకురాకుండా పోతున్నాయి. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వ్యవసాయ రంగం కొంతైనా మెరుగుపడుతుంది.   - ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే
 
 చెరువుల పరిరక్షణ కీలకం
 ప్రధాన తాగునీటి వనరులైన చెరువులు జిల్లాలో చాలాచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్నింట్లో కబ్జాల పర్వం కొనసాగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చేపట్టే ప్రణాళికల్లో చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వాటిని సంరక్షించేందుకు ప్రహరీలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.

- ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే
 

మరిన్ని వార్తలు