మా జీవితాలు ‘చెత్త' బతుకులేనా?

9 Nov, 2014 03:42 IST|Sakshi
మా జీవితాలు ‘చెత్త' బతుకులేనా?

‘‘చెత్త తీసేందుకు మేము కావాలె... డ్రైనేజీ పనికి మేమే కావాలె... ఆఖరికి ఇంటిముందు కుక్కలు, పందులు చచ్చినా మేమే వచ్చి తీయాలె... కానీ గుక్కెడు నీళ్లడిగితే మాత్రం మీరియ్యరు. బుక్కెడు బువ్వ కూడా పెట్టరు. మమ్ముల్ని చూస్తే ఈసడించుకుంటరు. కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా సూత్తలేరు. మేమేం పాపం చేసినం సారూ... మేము మనుషలం కాదా?’’ పారిశుధ్య కార్మికురాలు యశోద గుండెల్లో నుంచి వచ్చిన మాటలివి.

నిజానికి కార్మికులందరి గుండెల్లో ఉన్న వేదన ఇది. రోడ్లపై చెత్తను, డ్రైనేజీల్లో పేరుకుపోయిన అశుద్ధిని చిత్తశుద్ధితో ఏరిపారేస్తూ నగరాన్ని ఎప్పటికప్పుడు సుందరంగా ఉంచుతున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు పడుతున్న బాధలను, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బల్దియా మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్  ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారారు. శనివారం తెల్లవారుజామునే వీధుల్లోకి వచ్చి పారిశుధ్య కార్మికులను పలకించారు. సమస్యలను అడిగారు. వారి గుండెల్లో గూడుకట్టుకున్న బాధను, వేదనను పాఠకుల ముందు ఆవిష్కరించారు.
 
 మేయర్ హామీలివీ..
 పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వెంటనే మాస్కులు, గ్లౌజులు, బూట్లు అందిస్తామన్నారు. ఇప్పటికే 125 పర్మినెంట్, 681 కాంట్రాక్టు, 66 మంది గ్రూపు కార్మికుల కోసం వీటిని తెప్పించామన్నారు. వారం రోజుల్లోగా వీటిని కార్మికులకు పంపిణీ చేయాలని శానిటరీ సూపర్‌వైజర్ రాజమనోహర్‌కు సూచించారు. పదిహేను రోజులకోసారి చీపుర్లు అందించాలని శానిటరీ జవాన్‌ను ఆదేశించారు. పీఎఫ్ జమ చేయడంలో బల్దియా అధికారుల నిర్లక్ష్యం ఉంటే వెంటనే సమస్య పరిష్కరిస్తానని అన్నారు. కార్మికులకు వేతనాలు ప్రతి నెల పదో తేదీలోగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
 
 
 ‘‘మా నౌకర్లు పర్మెంటు గావాలె. తెలంగాణ అచ్చినంక జేత్తమన్నరు. ఈ కాంటాక్టు జీతాలద్దు మాకు. గౌర్మెంటు జీతాలే గావాలే. పక్క ఊర్లల్లకెల్లి అత్తన్నం. రోజుకు యాబై అటో కిరాయిలైతన్నయ్. మాకు ఇక్కన్నే ఇండ్ల స్థలాలియ్యాలె.
 - శంకరమ్మ
 
 రవీందర్‌సింగ్ : అందరూ బాగున్నారా?
 లక్ష్మి : అంతా మీ దయ సారూ.. ఇప్పుడైతే ఇట్టున్నం.
 రవీందర్‌సింగ్ : ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా?
 శోభరాణి : 24 గంటలు దుమ్ముల, వాసనల బతికోటోళ్లం. రోగాలు, నొప్పులు వస్తన్నయ్. అన్ని భరించుకుంటున్నం. చాతగాని నాడు సెలవువెట్టుకుంటున్నం. మళ్ల తెల్లారి తప్పదన్నట్టు పనికత్తన్నం.
 రవీందర్‌సింగ్ : దవాఖానాకు పోతుండ్రా మరి?
 ప్రేమలత : జరమచ్చి, రోగమచ్చి సర్కారు దవఖానకెళ్తే ఎవ్వలు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ డ్రెస్సేసుకొని పోయినా కానుతలేరు. మున్సిపలోల్లు అచ్చినప్పుడు పట్టించుకునేటట్లు చెయ్యాలె. జరాలు, రోగాలు అచ్చినప్పుడు ఇబ్బందయితంది.
 రవీందర్‌సింగ్ : పనికి తగ్గట్టు వసతులు మంచిగున్నయా?
 హన్మంతు : మోరీలల్ల దిగినప్పుడు గాజు వక్కలు, సూదులు గుచ్చుకపొయ్యి గాయాలైతన్నయ్. చెత్త తీసేటప్పుడు చేతులకు గుచ్చుకుంటన్నయ్. మోరీలు తీసేటప్పుడు, చచ్చిపోయిన పందులను, కుక్కలను తీసేటప్పుడు వాసన భరించలేకపోతున్నం. కక్కచ్చినట్లయితంది. మాకు మాస్కులు, చేతులకు గ్లౌజులు, బూట్లు ఇయ్యాలె. అవ్వి లేకపోతే పనిజేసేటప్పుడు చాన కట్టమైతంది.
 రవీందర్‌సింగ్ : ప్రైవేటు హాస్పిటల్స్‌లో వేస్టేజ్,
 చెత్త అన్నీ మీరే తీస్తున్నరా?
 అనిల్ : లైన్ ప్రకారం తీస్తన్నం. ఎసోంటి పనైనా మేమే చెయ్యాలెగదా. పని నచ్చినప్పుడు చాయమందం పైసలిత్తరు. ఒక్కొక్కలు ఇయ్యనే ఇయ్యరు. అయినా మాపని మేం జేసుకుంటనేపోతం.
 రవీందర్‌సింగ్ : మీకు ఏం కావాలనుకుంటున్నరు?
 యశోద : మమ్ములను మంచిగ జూసుకుంటే మేము రోడ్లను, వాడలను మంచిగ ఊడుత్తం. దోమలు పెరగకుండ జూత్తం. చీపుర్లు ఇస్తలేరు, మాస్కులు ఇత్తలేరు. నూనెలు, సబ్బులు, చెప్పులు ఇయ్యాలె. చీపుర్లు బయటకొంటె ఇరవై రూపాలు అయితన్నయ్. పదిగేను రోజులకోసారైనా చీపుర్లు ఇయ్యాలె.
 రవీందర్‌సింగ్ : జీతాలు నెలనెల వస్తున్నాయా?
 బాలవ్వ : జీతాలు రెన్నెళ్లకు, మూన్నెళ్లకు అత్తన్నయ్. ఏ నెల జీతం ఆనెల ఇత్తె మంచిగుంటది. ఇంటి ఖర్చులకు, పోరగాండ్ల చదువులకు తిప్పలైతాంది. రోజురోజుకు ఖర్చులు పెరుగుతన్నయ్. జీతాలు కూడా పెరుగాలె.
 రవీందర్‌సింగ్ : వేతనాలు రూ.6700 నుంచి ఆర్నెల్ల క్రితం రూ.8300 పెరిగినయి కదా.. పీఎఫ్ నెంబర్లు వచ్చినయా?
 అంజనేయులు : ఏమో సారూ... అందరికీ పీఎఫ్ నంబర్లు ఇచ్చినమని చిట్టీలైతే ఇచ్చిండ్రు. బుక్కులియ్యలే. మాకైతే నంబర్లు తెలువయిగని,  కట్‌చేసిన పైసలు కడుతలేరని చెబుతుండ్రు. మాకు అన్యాయం కావద్దు.
 రవీందర్‌సింగ్ : మీకు ఇంకా ఏమేం కావాలో చెప్పండి?
 శంకరమ్మ : మా నౌకర్లు పర్మెంటు గావాలె. తెలంగాణ అచ్చినంక జేత్తమన్నరు. ఈ కాంటాక్టు జీతాలద్దు మాకు. గౌర్మెంటు జీతాలే గావాలే. పక్క ఊర్లల్లకెల్లి అత్తన్నం. రోజుకు యాబై అటో కిరాయిలైతన్నయ్. మాకు ఇక్కన్నే ఇండ్ల స్థలాలియ్యాలె.
 రవీందర్‌సింగ్ : తెల్లకార్డులున్నయా..
 ఆహారభద్రతకు దరఖాస్తు చేసుకున్నరా?
 లక్ష్మి : అందరికీ తెల్లకార్డులున్నయ్. ఆహారభద్రత కార్డుల కోసం గూడ దరఖాస్తు పెట్టుకున్నం. ఎప్పుడిత్తరో ఏమో. మాకైతే పెద్ద దవఖాన్లకు సూపించుకునేతట్లు సౌకర్యం చెయ్యాలె. దవాఖాన కార్డులియ్యాలె.
 రవీందర్‌సింగ్ : పోచయ్య డల్లుగున్నవ్... జ్వరమొస్తందా?
 పోచయ్య : అవును సారూ.. నిన్న మొన్న జరముండే. ఇయ్యల్ల కొంచెం తగ్గింది. రెండు రోజులు సెలవుపెట్టిన. నాకు వయసైపోతంది. బాగ చాతకాకపోతే నా కొడుకును నౌకరికి ఎక్కిత్తననుకుంటన్న. ఇంకేంజెయ్యాలె.
 రవీందర్‌సింగ్ : ఎవ్వరైనా ఇబ్బంది పెడుతున్నారా?
 ప్రభాకర్ : చెప్పిన పని చేస్తన్నం. పనికాడ, ఆజిరికాడ మమ్ములను ఇబ్బందేం పెడుతలేరు. కానీ పనిభారం ఎక్కువైతాంది. ఇద్దరు చేసేకాడ ఒక్కరితోనే చేయిత్తాండ్రు. మనుషులు తక్కువైన కాడ జబ్బలు, కాల్లు పోతన్నయ్. ఇబ్బంది అయితంది. సిబ్బందిని పెంచితే ఇంకా మంచిగ పనిచేస్తం.
 రవీందర్‌సింగ్ : ట్రాక్టర్ డ్రైవర్‌గా ఎన్నాళ్ల నుంచి
 చేస్తున్నవ్, లెసైన్స్ ఉందా?
 వెంకటయ్య : సారు మొదట్ల లేబర్‌గానే పనికెక్కిన. డ్రైవింగ్ నేర్చుకున్నంక లెసైన్స్ తీసుకున్న. ఐదేండ్ల నుంచి డ్రైవర్‌గా జేత్తన్న. సందులల్లకు పోయినప్పుడు ట్రాక్టర్ తిరుగుటానికి కొద్దిగ ఇబ్బంది అయితది. మేన్‌రోడ్లమీద ఫర్వలేదు.
 రవీందర్‌సింగ్ : డివిజన్లకు వెళ్లినప్పుడు ఎలా ఉంటుంది?
 శోభారాణి : పనైతే చేయించుకుంటరు గని, మంచినీళ్లు అడిగినా శానిటేషనోల్లమని ఇయ్యడానికి ఎనుకముందు జేత్తండ్రు. కుక్కజచ్చినా, పిల్లిజచ్చినా పిలుత్తరు. పనిచేయడానికి మేం కావాలెగని, మమ్మల్ని పట్టిచ్చుకోరు.
 రవీందర్‌సింగ్ : రిక్షాలకు చెత్త ఇస్తుండ్రా?
 వెంకటేష్ : వాడలల్లకు పోయి విజిల్ వేస్తే ఇండ్లల్లకెళ్లి చెత్త తెచ్చి ఇస్తరు. రిక్షాలు రిపేరుకొస్తే పట్టిచ్చుకుంటలేరు. మేము రిపేరు చేయించుకుందామన్నా పైసలిత్తలేరు. పంచరైన రిక్షాలను గుంజుకపోతంటే చాతిల నొప్పత్తంది.
 రవీందర్‌సింగ్ : సీఎం కేసీఆర్ మన నగరాన్ని
 స్మార్ట్ సిటీ చేస్తానంటుండు. నగరాన్ని సుందరంగా
 ఉంచుటానికి ఏం చేస్తే బాగుంటది?
 యశోద : సార్... మేం లచ్చలు, కోట్లు అడగం.     మమ్ముల్ని మనుషులుగా చూడాలని కోరుతున్నం. ఏం సార్... మేం మనుషులం కాదా? మీరు మాకు గౌరవం కల్పిస్తే కేసీఆర్ సార్ చెప్పినట్లు కరీంనగర్‌ను అందంగా ఉంచుతం. అందుకోసం ఎంత పనైనా చేస్తం. తెలంగాణలో మనమే ఫస్టుంటం.
 
 సార్... మేం లచ్చలు, కోట్లు అడగం. మమ్ముల్ని మనుషులుగా చూడాలని కోరుతున్నం. ఏం సార్... మేం మనుషులం కాదా? మీరు మాకు గౌరవం కల్పిస్తే కేసీఆర్ సార్ చెప్పినట్లు కరీంనగర్‌ను అందంగా ఉంచుతం. అందుకోసం ఎంత పనైనా చేస్తం. తెలంగాణలో మనమే ఫస్టుంటం.             
 - యశోద

మరిన్ని వార్తలు