మన విద్యార్థులు పదిలం

4 Aug, 2019 02:32 IST|Sakshi

వారిని క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తాం

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి

అన్నివిధాలా సాయం అందిస్తాం: కేటీఆర్‌

సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) క్యాంపస్‌ను ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందులో చదువుతున్న 135 మంది తెలుగు విద్యార్థులను క్షేమంగా వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్‌ల ద్వారా ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ జమ్మూకశ్మీర్‌ అధికారులతో సంప్రదింపులు జరిపి విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు చేరే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిషన్‌రెడ్డి శనివారం ఢిల్లీలో మీడియాకు వివరించారు. ఎన్‌ఐటీలోని 5,000 మంది విద్యార్థులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులతో సమన్వయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ప్రత్యేక బలగాల రక్షణలో ముందుగా జమ్మూ పట్టణానికి తరలిస్తున్నామని, అక్కడి నుంచి వివిధ రవాణా మార్గాల ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఎలాంటి ఆందోళన చెందరాదని కోరారు. తెలంగాణ విద్యార్థుల జాబితాను బండి సంజయ్‌.. కిషన్‌రెడ్డికి అందజేశారు. మరోవైపు ఈ అంశంపై టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. శ్రీనగర్‌లోని తెలుగు విద్యార్థులు ఆందోళన చెందుతూ తనకు మెసేజ్‌లు పంపుతున్నారని, అయితే విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని పేర్కొన్నారు. సాయం కావాల్సిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతం గిరిని 011–233820141, 919968299337 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

విద్యార్థులతో భవన్‌ అధికారుల సంప్రదింపులు 
ఎన్‌ఐటీ విద్యార్థులతో ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతం గిరి సంప్రదింపులు జరిపారు. విద్యార్థులను జమ్మూ వరకు చేర్చేందుకు ఎన్‌ఐటీ అధికారులు నాలుగు బస్సులు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు విద్యార్థులు జమ్మూ చేరుకోనున్నారు. అక్కడి నుంచి వారిని 3 బస్సుల్లో ఢిల్లీకి చేర్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారని, వారితో సమన్వయం చేస్తున్నామని ప్రవీణ్‌ ప్రకాశ్‌ వెల్లడించారు. విద్యార్థులు ఢిల్లీ చేరగానే వారికి వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.  

>
మరిన్ని వార్తలు