-

చిత్తూరు తరలుతున్న మన చింతపండు

5 May, 2014 01:29 IST|Sakshi

ఎల్లారెడ్డిటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో పండిన చింతపండు సీమాంధ్ర జిల్లా చిత్తూరుకు తరలుతోంది. ఈ ఏడాది విరివిగా కాయడంతో ధర కూడా తక్కువగా పలుకుతోంది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, నిజాంసాగర్ మండలాల్లో చింతపండు బాగా కాసింది. దీంతో రైతులు చింతపండును తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తున్నారు. ప్రతీ ఆదివారం ఎల్లారెడ్డిలో జరిగే సంతలో జిల్లాకేంద్రానికి చెందిన పలువురు దళారులు ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు మండలాల్లోని ఆయా గ్రామాల్లో కాసిన చింతపండును రైతులు ఎల్లారెడ్డికి తరలిస్తున్నారు. గత సంవత్సరం కాత తక్కువగా ఉండటంతో క్వింటాల్‌కు 2600 పలికిన ధర, ప్రస్తుతం 1600 నుంచి 1800 మాత్రమే పలుకుతోంది.

 పులుపుంటే ధర ఎక్కువ
 మన జిల్లాలో పండిన చింతపండు ఎక్కువగా పులుపు ఉంటుందని, సీమాంధ్ర ప్రాంతంలో ఇలాంటి దానికి ధర ఎక్కువగా పలుకుతుందని కొనుగోలు చేస్తున్న దళారులు చెబుతున్నారు. ప్రస్తుతం 1800కు కొనుగోలు చేసిన చింతపండును జిల్లాకేంద్రంలోని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తామని, ధర మరింత పెరిగిన తర్వాత అక్కడికి తరలిస్తామని వారు పేర్కొంటున్నారు. నెల రోజులుగా ఎల్లారెడ్డిలో సంత రోజున సుమారు 30కి పైగా దళారులు కొనుగోలు కేంద్రాలను తెరుస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన పండును లారీల్లో నింపి జిల్లాకేంద్రానికి తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో చింతపండును కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో వివిధ గ్రామాల నుంచి రైతులు పండును ఎడ్లబండ్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల్లో తీసుకుని ఎల్లారెడ్డికి వస్తున్నారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు