మాది రైతు ప్రభుత్వం

30 Oct, 2014 03:36 IST|Sakshi
మాది రైతు ప్రభుత్వం

సంగారెడ్డి అర్బన్: రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు.బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఐఐటీ కళాశాల నిర్మాణంలో భూములు కోల్పోయిన 20 మంది రైతులకు ఇంటి స్థలాల పట్టాలు, సింగూర్ పైప్‌లైన్ వల్ల భూములు కోల్పోయిన 47 మంది రైతులకు రూ. 56.37 లక్షల పరిహారాన్ని మంత్రి హరీష్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిహారం అందాల్సిన వారు ఇంక ఎవరున్నా వారికి కూడా త్వరలోనే పరిహారం పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం పరిహారంగా ఎకరాకు రూ.3 లక్షల చెల్లించగా, ప్రస్తుతం ఆ పరిహారాన్ని పెంచి రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. రుణమాఫీ కింద ఇప్పటికే రూ.499 కోట్లు జిల్లాలోని రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు.

ఇప్పటివరకు రైతులకు రూ.700 కోట్ల కొత్త రుణాలు రైతులకు మంజూరు చేయించామన్నారు. అంతేకాకుండా రైతులకు మద్దతు ధర దక్కేలా జిల్లా వ్యాప్తంగా మక్క, వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం లోనే ప్రయోగాత్మకంగా జిల్లాలో సేకరించిన మొక్కజొన్నకు కూడా ఆన్‌లైన్ ద్వారా రైతులకు చెల్లింపులు ప్రారంభించామన్నారు. 72 గంటల్లో రైతులకు డబ్బు చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంతేకాకుండా పాడి రైతుకు మేలు జరిగేలా లీటరుకు రూ. 4 పెంచినట్లు వివరించారు. షేడ్‌నెట్ కింద రైతులు కూరగాయలు పండించేందుకు రూ. 280 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోందన్నారు.

డ్రిప్ ఇరిగేషన్ సాగు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీతో, చిన్న సన్న కారు రైతులకు 90 శాతం, మిగతా రైతులందరికీ 80 శాతం సబ్సిడీతో పరికరాలను సమకూర్చనున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ఎంతో కాలంగా పెండింగ్‌లోఉన్న పరిహారాన్ని , ఇళ్ల స్థలాల పట్టాలను నూతన ప్రభుత్వం మంజూరు చేసి రైతులను ఆదుకుందన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయినట్లయితే సంబంధిత తహశీల్దార్ల ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
 
8న పింఛన్ల పంపిణీ
జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, జిల్లాలో ఆహార భద్రత కార్డులకు 8 లక్షల దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 50 శాతం పరిశీలన పూర్తయిందని తెలిపారు. పింఛన్ కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులందగా, 60 శాతం పరిశీలన పూర్తయిందన్నారు. నవంబర్ 1 తేదీ నాటికి పరిశీలన పూర్తిచేసి 8వ తేదీన అందరికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు చివరి తేదీ అంటూ ఏమీ లేదన్నారు. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, జేసీ శరత్, అదనపు జేసి మూర్తి, డీఆర్‌ఓ దయానంద్, సంగారెడ్డి తహశీల్దార్ గోవర్దన్ తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు