ఇంజనీరింగ్‌లో ఔట్‌కమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌! 

15 Dec, 2018 03:42 IST|Sakshi
జే హబ్‌ పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న పుణ్య, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ వేణుగోపాల్‌ రెడ్డి

ఓపెన్‌ బుక్స్‌ పరీక్షల విధానంపై కసరత్తు మొదలు 

ఇంజనీరింగ్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల నుంచి అభిప్రాయ సేకరణ

 హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీటీఈ వైస్‌ చైర్మన్‌ పుణ్య 

ప్రవేశాలు, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నట్లు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో ఔట్‌కమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌ అమలు కోసం కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓపెన్‌ బుక్స్‌ పరీక్షల విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్‌ పూర్తి చేశారన్నట్లు కాకుండా కాలేజీల్లో చేరిన విద్యార్థుల్లో ఎంత మందికి ప్లేస్‌మెంట్స్‌ వస్తున్నాయన్న అంశంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రధానంగా దృష్టి సారించింది. దీనిలో ముఖ్యంగా ఇంజనీరింగ్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనం విధానాల్లో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో ఆలోచన, తార్కిక శక్తిని పెంపొందించడంతోపాటు విశ్లేషణాత్మక పరీక్షలు రాసేలా ప్రశ్నపత్రాల రూపకల్పన ఉండాలని భావిస్తోంది. అందుకోసం ఓపెన్‌ బుక్స్‌ పరీక్షల విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీనిపై రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ఏఐసీటీఈ వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.పి.పుణ్య రాష్ట్రానికి వచ్చారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశమై అదే అంశాన్ని వివరించారు. అందుకు అనుగుణంగా కాలేజీలు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు కాలేజీల్లో సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఏఐసీటీఈ ఇకపై కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులు, వారికి లభిస్తున్న ఉద్యోగ అవకాశాలు (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌), అందుకు కాలేజీలు చేపడుతున్న చర్యలపైనే ప్రధాన దృష్టి సారించనున్నట్లు పుణ్య వెల్లడించారు. ఈ సందర్భంగా పలు కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముందుగా ఐఐటీ, ఎన్‌ఐటీ, యూనివర్సిటీ కాలేజీల్లో ఈ విధానం అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం అనేక కాలేజీల్లో ఆ స్థాయిలో ప్రొఫెసర్లు లేరని, ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం కనీస సిబ్బంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.

ఈ విధానం అమలు చేయాలంటే ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకుల అవసరం ఉంటుందని తెలిపారు. అలాగే ఇండస్ట్రీలో 20 నుంచి 30 ఏళ్ల అనుభవం కలిగిన వారిని ప్రొఫెసర్లుగా నేరుగా నియమించుకునే అధికారం రాష్ట్ర యూనివర్సిటీలకు ఇవ్వాలని కోరారు. అప్పుడే ఇండస్ట్రీకి ఏం అవసరం అన్నది సమగ్రంగా తెలుస్తుందని, దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టవచ్చని స్టాన్లీ ఇంజనీరింగ్‌ కాలేజీ చైర్మన్‌ కృష్ణారావు, విద్యాభారతి ఇంజనీరింగ్‌ కాలేజీ చైర్మన్‌ గౌతంరావు పేర్కొన్నారు.  

కరిక్యులమ్‌లో మార్పులు తీసుకురండి.. 
నియామకాల సంగతి తరువాత చర్చిద్దామని, ముందు ఇండస్ట్రీ వర్గాలతో జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు, ప్రైవేటు యాజమాన్యాలు సమావేశమై పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ కరిక్యులమ్‌లో మార్పులు తీసుకురావాలని పుణ్య వివరించినట్లు తెలిసింది. మొత్తానికి వచ్చే విద్యా సంవత్సరంలో ఔట్‌కమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్, ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానానికి యాజమాన్యాలు సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో హైదరాబాద్‌ జేఎన్‌టీయూ, అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్లు, వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు