మట్టి కొట్టుకుపోతున్న ఔటర్

26 May, 2016 15:50 IST|Sakshi
మట్టి కొట్టుకుపోతున్న ఔటర్

    పట్టించుకోని అధికారులు
    ఆందోళనలో ప్రయాణికులు


ఘట్‌కేసర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఫలితంగా పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు వీటిని పరిశీలించాల్సిన వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో నాసిరకంగా జరుగుతున్నాయి. ‘ఔటర్’ పనులు పూర్తి స్థాయిలో అయిపోనేలేదు.. అన్ని రూట్లలో వాహనాలకు అనుమతి ఇవ్వనేలేదు.. కానీ రోడ్డుకు పోసిన మట్టి మాత్రం.. ఇటీవల కురిసిన కొద్ది పాటి వర్షానికే కొట్టుకుపోతోంది.
 
మండలంలోని అన్నోజీగూడ నుంచి ఘనపూర్ వెళ్లే వీయూపీకి ఎడమ పక్కన అవుటర్ రోడ్డుకు పోసిన మట్టి ఇటీవల కురిసిన చిన్న పాటి వర్షానికే కొట్టుకు పోయింది. ఇలాగే వదిలేస్తే.. పెద్ద వర్షాలకు రహదారి పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రయాణికులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఘట్‌కేసర్ నుంచి విజయవాడ, శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. తిరిగి మట్టిని పోసి మరమ్మతులు చేయకపోతే రోడ్డు కుంగిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాకాలం రాకముందే అవసరమైన చోట్లలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ట్రాఫిక్ సమస్య నివారణకు...
భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నిరోధించి ట్రాఫిక్ సమస్యను నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తోంది. దీంతో ముంబై, రాజీవ్ రహదారి నుంచి వచ్చే వాహనాలు శంషాబాద్, విజయవాడ వెళ్లేందుకు.. వరంగల్ , నల్గొండ నుంచి ముంబై వెళ్లే వాహనాలు కూడా నగరంలోకి ప్రవేశించకుండానే నేరుగా ఆయా జాతీయ రహదారులను చేరుకునే వీలు కలిగింది. పనుల్లో భాగంగా మండల పరిధిలోని కండ్లకోయ, శామీర్‌పేట్, ఘట్‌కేసర్‌లో అవుటర్ రింగురోడ్డు సమీపంలో పెద్ద జంక్షన్లు నిర్మిస్తున్నారు. రింగురోడ్డు నుంచి అవతల ఉన్న గ్రామాల ప్రజలు చేరుకోవడానికి.. అవరసరమైన చోట వెహికిల్ అండర్ పాస్ (వీయూపీ)లు నిర్మిస్తున్నారు.  
 మరమ్మతులు చేపట్టాలి

చిన్న పాటి వర్షానికే రోడ్డుకు పోసిన మట్టి కొట్టుకుపోతోంది. వెంటనే మరమ్మతులు చేయకపోతే రోడ్డు పూర్తిగా కుంగిపోయే అవకాశం ఉంది. రోడ్డు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కోతకుగురైన ప్రదేశంలో మట్టి పోయాలి.
- సత్తయ్యగౌడ్, మాజీ ఉప సర్పంచ్, ఘనపూర్

>
మరిన్ని వార్తలు