ఆసుపత్రుల్లో ఓపీ షురూ

7 May, 2020 00:46 IST|Sakshi

రెడ్‌జోన్‌ జిల్లాలు మినహా మిగిలినచోట్ల ప్రారంభం

గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌ జిల్లాల్లో మొదలైన రోగుల రాక

రెండుమూడ్రోజుల్లో ఓపీ పెరుగుతుందంటున్న వైద్యులు

ఆస్పత్రుల్లో భౌతిక దూరం పాటించాలని అధికారుల ఆదేశాలు

వైద్యులు, ఇతర సిబ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బుధవారం నుంచి ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలు మొదలయ్యాయి. వాస్తవంగా ఇప్పటికే అత్యవసర వైద్య సేవలకు తోడు ఓపీ సేవలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, వైద్యాధికారులు కరోనా భయంతో ఓపీ సేవలు ప్రారంభిస్తే జనం గుమికూడుతారని భయపడి తెరవడానికి అనేకచోట్ల నిరాకరించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌జోన్, ఆరెంజ్‌ జోన్లలో సడలింపులు ఇవ్వడంతో ఆసుపత్రులు కూడా ఓపీ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాయి. హైదరాబాద్‌ రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నప్పటికీ ఇక్కడ కొన్ని కార్పొరేట్, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రులు దాదాపు 30 శాతం మేరకు ఓపీ సేవలతో నడిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత పూర్తిస్థాయిలో నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వారు చెబుతున్నారు. రెండుమూడు రోజుల్లో ఓపీ సేవలు పెరుగుతాయని వివిధ జిల్లాల ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. 

జాగ్రత్తలు తప్పనిసరి: రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నాయి. ఇక ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, జనగాం, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, జోగులాంబ గద్వాల, కరీంనగర్, నారాయణ్‌పేట్‌ జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. ఇక సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, ములుగు జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. త్వరలో కొన్ని ఆరెంజ్‌ జిల్లాలు గ్రీన్‌జోన్‌ పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కంటైన్మెంట్లు మినహా మిగిలిన అన్నిచోట్లా ఆసుపత్రుల్లో ఓపీ సేవలకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.

వాస్తవంగా లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో ప్రతీ రోజూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రల్లో 1.25 లక్షల మంది ఓపీ సేవలకు వస్తుండేవారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో దాదాపు 30 నుంచి 40 వేల మంది ఓపీ సేవలకు వచ్చేవారని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆ స్థాయిలో ఓపీలు రాకపోవచ్చని, ఆ పరిస్థితి రావడానికి సమయం తీసుకుంటుందని అంటున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఓపీ నిర్వహించేప్పుడు రోగుల నిర్వహణ పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం, వచ్చే ప్రతీ రోగి మాస్క్‌ ధరించేలా చూడటం, శానిటైజర్లు వారికి అందుబాటులో ఉంచడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. లేకుంటే ఆసుపత్రులే కరోనా వైరస్‌ కేంద్రాలుగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. 

వైద్య సిబ్బందికి సూచనలు...
మరోవైపు ఆసుపత్రుల్లో రోగులను చూసే వైద్య సిబ్బంది కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, ముక్కుకారటం, ఇతర కరోనా లక్షణాలున్న రోగులు వస్తే వారి విషయంలో ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు వైద్యులు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్‌లు ధరించాలని, చేతికి గ్లోవ్స్‌ ధరించాలని సూచిస్తున్నారు. ఇక కరోనా బ్లాక్‌ ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలు అందించే పరిస్థితి ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి విదితమే. ఓపీ చూడటానికి వైద్యులు భయపడాల్సిన అవసరంలేదని కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. రక్షణ చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నారు. రోగులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఆసుపత్రి ముందు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో బోర్డుపై ప్రదర్శించాలని కోరారు. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని జాగ్రత్తలతో మార్గదర్శకాలు జారీ చేస్తామని వైద్యాధికారి ఒకరు తెలిపారు.  

మరిన్ని వార్తలు