‘భగీరథ’ గుట్టపై కలకలం

21 Jul, 2020 02:22 IST|Sakshi
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని మిషన్‌ భగీరథ ఓవర్‌హెడ్‌ ట్యాంకుపైకి ఎక్కి నిరసన తెలుపుతున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 

వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్ల మెరుపు ధర్నా

ఓవర్‌ హెడ్‌ ట్యాంకులపైకెక్కి తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు

పోలీసుల సూచనలతో ఆందోళన విరమణ  

గజ్వేల్‌: మిషన్‌ భగీరథ పథకానికి కేంద్ర బిందువుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత ప్రాంతం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండ మిషన్‌ భగీరథ గుట్టపై సోమవారం కలకలం రేగింది. తమను విధుల నుంచి తొలగించారని ఆగ్రహంతో ఉన్న భగీరథ పథకం ఔట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్‌ దృష్టికి వెళ్లేలా తమ నిరసనకు వ్యూహాత్మకంగా గజ్వేల్‌ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 200 మందికిపైగా ఉద్యోగులు వివిధ దారుల్లో తరలివచ్చి ఒక్కసారిగా మిషన్‌ భగీరథ హెడ్‌వర్క్స్‌కు చేరుకొని మెరుపు ఆందోళనకు దిగారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకులపైకి ఎక్కి తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.

సుమారు ఏడు గంటలకుపైగా ఈ ఆందోళన కొనసాగడంతో పోలీసు, రెవెన్యూ, మిషన్‌ భగీరథ అధికారులు ఉరుకులు, పరుగులు పెటాల్సి వచ్చింది.  రాత్రి 7 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఆ తర్వాత పోలీసులు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నచ్చజెప్పి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూస్తామని, ఆందోళన చేపట్టినందుకు కేసులు ఉండవని హామీ ఇవ్వడంతో వారు స్వచ్ఛందంగా ట్యాంకుల పైనుంచి కిందకు దిగారు. ఆ తర్వాత వారందరినీ బేగంపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.  

సమస్య పరిష్కారం కాకపోవడంతో..  
మిషన్‌ భగీరథ పథకంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేయడానికి 2015లో రాష్ట్రవ్యాప్తంగా 709 మందిని ఎంపిక చేశారు. ఇందులో 662 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా, 47 మంది జూనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వీరి పోస్టులను ఏడాదికోసారి రెన్యువల్‌ చేస్తుంటారు. ఈసారి మార్చి 31న వీరిని రెన్యువల్‌ చేయాల్సి ఉండగా అది జరగలేదు. జూన్‌ 30 వరకు అలాగే విధుల్లో కొనసాగించారు. ఆ తర్వాత జూలై 1 నుంచి విధుల్లోకి రావొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

ఈ పరిణామంతో ఆందోళనకు గురైన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వివిధ రూపాల్లో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. తమను యథాతథంగా విధుల్లో కొనసాగించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే కనీసం ఈ ఏడాదైనా కొనసాగించి వచ్చే ఏడాది తొలగించాలని చెబుతూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి వీరికి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ సమస్యను తెలపాలన్న భావనతో వ్యూహాత్మకంగా గజ్వేల్‌ను ఆందోళనకోసం ఎంచుకున్నారు.

మరిన్ని వార్తలు