మూగజీవాల మృత్యువాత

31 Mar, 2018 03:51 IST|Sakshi
మృత్యువాతపడిన గొర్రెలు

నల్లగొండ జిల్లాలో నాలుగు రోజుల్లో 300 పైచిలుకు గొర్రెల మృతి

తీవ్రంగా నష్టపోతున్న పాలమూరు యజమానులు

ఆంత్రాక్స్‌గా కాపరుల అనుమానం 

కాదంటున్న వైద్యులు

సాక్షిప్రతినిధి, నల్లగొండ: పాలమూరు జిల్లా నుంచి గొర్రెల మందలు తీసుకువచ్చిన కాపర్లకు పెద్ద కష్టమే వచ్చిపడింది. మేత కోసం నల్లగొండ జిల్లాకు వచ్చిన జీవాలు అంతుపట్టని వ్యాధి సోకి పిట్టల్లా రాలిపోతున్నాయి.  నాలుగు రోజుల్లో 300 దాకా గొర్లు చనిపోవడంతో వారికి దిక్కు తోచడం లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా రామచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన ఐదుగురు, దేవరకద్ర మండలం గద్దెగూడ గ్రామానికి చెందిన ఇద్దరు, అవంగపట్నంకు చెందిన ముగ్గురు, వేముల గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపరులు సుమారు మూడువేల గొర్రెల మందను తీసుకుని జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మందలో కొన్ని గొర్రెలు మేత మేయకుండా నలతగా ఉండడాన్ని గమనించిన కాపరులు గుంటూరు జిల్లా మాచర్లనుంచి మందులు కొనుక్కువచ్చి చికిత్స చేశారు. అయినా, ఈనెల 27వ తేదీనుంచి ఒక్కొక్కటిగా జీవాలు చనిపోవడం మొదలు పెట్టాయి.

సమాచారం తెలుసుకున్న సంచార వైద్య సిబ్బంది 1962 వాహనంతో వచ్చి జీవాలకు చికిత్స అందించారు. అయినా, మరణాలను ఆపలేక పోయారు. ఇలా.. వరుసగా శుక్రవారం దాకా మందలోని గొర్లు చనిపోతూనే ఉన్నాయి. మిర్యాలగూడ మండలం తుంగ పాడుకు చేరుకున్న మందలో శుక్రవారం సైతం మరో అరవై గొర్రెలు చనిపోయాయి. సుమారు 3వేల మందను నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో నాగార్జున సాగర్‌ ఆయకట్టు కింద హాలియా, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌ మండలాల్లో మేత కోసం తీసుకువచ్చామని బాధితులు చెప్పారు. తాము తిరిగి జూలైలో వానలు పడడంతో వెనక్కి వెళ్లిపోతామని, ఈ సారి తమను దురదృష్టం వెంటాడుతోందని వాపోతున్నారు. గొర్రెలు మృతిచెందడంతో పాలమూరునుంచి మేతకోసం పంపించిన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు.  

పనిచేయని వైద్యం..
కొద్ది రోజులుగా జీవాలు మృత్యువాత పడు తుండగా, పశువైద్య సిబ్బంది వైద్యం అందిస్తున్నా ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు. అసలు గొర్లకు వచ్చిన వ్యాధి ఏమిటో కూడా వైద్యులు చెప్పకపోవడంతో కాపరులు ఆందోళన చెందుతున్నారు. వైద్య సిబ్బంది నాలుగు రోజులుగా వైద్యశిబిరం ఏర్పాటు చేసి గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు. కొన్ని గొర్రెలకు ఆపరేషన్‌ చేసి పరీక్షించగా కడుపులో కాలేయం పూర్తిగా దెబ్బతిని ముక్కలు అయిందని చెబుతున్నారు. బీటీ పత్తి ఆకులు కూడా అరగక పచ్చి ముద్దలా కనిపిస్తోందని వైద్యసిబ్బంది అంటున్నారు. వెటర్నరీ బయొలాజికల్‌ రీసెర్చ్‌ సంస్థ బృందం గొర్రెల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి, మందలో ఉన్న గొర్రెల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపింది. ఆ రిపోర్టు ఇంకా అందక పోవడంతో ఏ విషయం చెప్పలేకపోతున్నారు.  

ఆంత్రాక్స్‌గా అనుమానం?
మృతిచెందిన గొర్రెలకు ఆంత్రాక్స్‌ వ్యాధి సోకిందేమోనని కాపరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాపరుల సొంత గొర్రెలతో పాటు సబ్సిడీ గొర్రెలు కూడా మంద వెంట ఉన్నాయి. సబ్సిడీ గొర్రెల ద్వారా ఏమైనా వ్యాధి ప్రబలిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరో వైపు కలుషిత నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

ఆంత్రాక్స్‌ కాదు.. ఆందోళన వద్దు
శుక్రవారం చనిపోయిన గొర్రెలకు నట్టలు ఉన్నాయి. వాటికి సంబంధించి చికిత్స చేస్తున్నాం. లెఫ్టో పైరోసిస్, మిక్స్‌డ్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల అవి చనిపోయాయి. దీనిని గుర్తించి చికిత్స అందివ్వడం ఫలితాలను ఇచ్చింది. ఇలా చనిపోయిన గొర్రెల నుంచి వైరస్‌ విస్తరించి ఇతర గొర్రెలు కూడా చనిపోయే ముప్పు ఉండటంతో  పూడ్పించాం. ఆంత్రాక్స్‌ సోకి గొర్లు చనిపోతున్నాయడం వాస్తవం కాదు.  రిపోర్టులు అందాక పూర్తి నిర్ధారణకు వస్తాం.
    –రమేశ్, జిల్లా పశువైద్యాధికారి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు