పది రోజుల్లో 459 పోస్టుల భర్తీ

29 Jun, 2018 02:35 IST|Sakshi
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: పది రోజుల్లో 459 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. పశువైద్యశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పన కోసం రూ.20 కోట్లు కేటాయించామన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాల ని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో సంచార పశువైద్యశాలల నిర్వహణపై పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, జీవీకే ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంచార పశువైద్యశాలల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.83 లక్షల తో కొత్తగా 20 మంది ఆపరేటర్లను నియమిస్తున్నా మన్నారు. 1962 టోల్‌ఫ్రీ నంబర్‌తో సంచార పశు వైద్యశాలల ద్వారా జీవాల వైద్యసేవల కోసం 10 మంది ఆపరేటర్లను నియమించుకున్నామని, దీని ద్వారా ప్రతిరోజూ 1,400 కాల్స్‌ వస్తున్నాయని, ఇందులో 500 ఫిర్యాదులపై  స్పందించి అవసరమైన జీవాలకు వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.  

టోల్‌ ఫ్రీ నంబర్‌ సేవలు పెంపు 
20 మంది ఆపరేటర్ల సేవలను వచ్చే నెల 10 నుంచి ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సామర్థ్యం పెంపుతో నిత్యం 5 వేల కాల్స్‌ను తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం 1962 సేవలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5  వరకు అందిస్తున్నామని, వీటిని ఉదయం 7కి ప్రారంభించి సాయం త్రం 5 వరకు కొనసాగించాలని ఆదేశించినట్టు తెలిపారు. 1962 వ్యవస్థను నిత్యం పర్యవేక్షించేందుకు తమ కార్యాలయంతో పాటు పశుసంవర్థకశాఖ కార్యదర్శి, డైరెక్టర్‌ కార్యాలయాల్లో ప్రత్యేక మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డైరెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా నలుగురు సిబ్బందిని నియమించి ఒక విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించానన్నారు. 100 సంచార పశువైద్యశాలలకు అదనంగా మరో 100 వాహనాల కొనుగోలుకు బడ్జెట్‌ కేటా యించాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు.  

మరిన్ని వార్తలు