ఓవర్‌టేక్ తెచ్చిన ప్రమాదం

18 Nov, 2014 23:57 IST|Sakshi

 పూడూరు: వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. చన్గోముల్ ఎస్‌ఐ నాగరాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన మదన్, మౌలాలికి చెందిన విశాల్, అరుణ్,  సుమన్‌లు స్నేహితులు. సుమన్ కొండాపూర్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో పనిచేస్తుండగా మిగిలిన ముగ్గురు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి మంగళవారం కారులో వికారాబాద్ సమీపంలోని ఓ రిసార్టుకు బయలు దేరారు.

అరుణ్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. పూడూరు మండలం అంగ డిచిట్టంపల్లి కాటన్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే ముందుగా ఉన్న లారీని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి సమీపంలోని పొలాల్లోకి ఎగిరి పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక రైతులు వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు లాగారు. అప్పటికే మదన్(28) మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో సుమన్(27) మృతి చెందాడు.

అరుణ్ పరిస్థితి విషమంగా ఉంది. విశాల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారు పూర్తిగా దెబ్బతింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను వికారాబాద్ మార్చూరీకి తరలించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది.

మరిన్ని వార్తలు