కరువును తరిమిన పల్లె!

19 May, 2018 01:47 IST|Sakshi
కామారెడ్డి జిల్లా గర్గుల్‌ గ్రామ ముఖచిత్రం

కామారెడ్డి జిల్లా గర్గుల్‌ గ్రామ విజయగాథ 

లెక్క ప్రకారమే నీళ్ల వాడకం 

తాగడానికి, స్నానానికి మాత్రమే బోరు బావినీళ్లు 

వాడుకున్న నీళ్లు ఇంకుడు గుంతల ద్వారా మళ్లీ భూమిలోకి 

గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు 

సాక్షి, హైదరాబాద్‌: పళ్లు తోముకునేందుకు ఓ మగ్గు నీళ్లు.. కాళ్లు, చేతులు కడుక్కునేందుకు మరో రెండు మగ్గులు.. స్నానానికి ఓ బకెట్‌.. మరుగుదొడ్డికి మరో బకెట్‌ నీళ్లు.. తాగటానికి 10 చెంబులు.. బట్టలు ఉతకటానికి 4 బకెట్లు.. కామారెడ్డి జిల్లాలోని గర్గుల్‌ గ్రామ ప్రజలు నిత్యం వాడుకునే నీళ్ల లెక్కలే ఇవి. ఈ ఊళ్లో లెక్కకు మించి ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయరు. వర్షపు నీటికి ఒడిసి పట్టుకోవటమే కాదు.. భూగర్భం నుంచి తోడిన జలాన్ని కూడా పొదుపుగా వాడుకుని కరువును జయించారు. నిండు వేసవిలోనూ నీటి కష్టం తెలియకుండా జీవిస్తున్నారు. వాడిన ప్రతి నీటి బిందువు వృథా కాకుండా ఇంకుడు గుంతలోకి జారే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో భూగర్భ జల మట్టం పెరుగుతోంది. గృహ అవసర జలాల వృథాను అరికట్టడంతో విజయం సాధించిన వీరు.. ఇప్పుడు పొలాల వద్ద కూడా సాగునీటి వృథాను నిలువరించటంపై దృష్టి పెట్టారు. 

2,250 మంది జనాభా 
2,250 మంది జనాభా ఉన్న గర్గుల్‌.. ఒకప్పుడు అన్ని గ్రామాల్లాగానే వేసవిలో నీళ్ల కోసం ఇబ్బంది పడేది. సమస్యను పరిష్కరించేందుకోసం.. భూగర్భ జలాలను వేగంగా తోడేసే బోరు బావుల తవ్వకాన్ని గ్రామంలో నిషేధించారు. ఈ నిర్ణయంతో రెండు పరిష్కారాలు దొరికాయి. నీళ్ల కోసం బోర్ల మీద బోర్లు వేసి అప్పుల పాలై, ఆత్మహత్య చేసుకునే ముప్పు నుంచి రైతులు బయటపడ్డారు. నీటిని ఇబ్బడిముబ్బడిగా తోడేసే పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

చేదబావి నీళ్లతోనే.. 
తొలుత గ్రామ సర్పంచు మొగుల్ల శ్యామల.. మహిళలను సంఘటితం చేశారు. నీటిని పొదుపుగా వాడుకునే మార్గాలను అన్వేషించి, అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. తాగునీరు, స్నానం తదితర అవసరాలకు మాత్రమే బోరు నీరు, మిగిలిన అన్ని అవసరాలకు చేదబావి నీళ్లు వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో 85 చేద బావులు ఉన్నాయి. ఉదయం ఒక గంట మాత్రమే నల్లా నీళ్లు వస్తాయి. ఇక మిగిలిన నీటి అవసరాలు అన్నీ కూడా చేద బావులే తీరుస్తాయి. 

ఇంకుడు గుంతలతో.. 
గ్రామంలో 640 కుటుంబాలు ఉండగా.. ఉపాధి హామీ పథకం కింద 595 ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. ఇంటి అవసరాలకు వాడిన నీరు కాలువ ద్వారా గుంతలోకి వెళ్లేటట్లు చేశారు. దీంతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. గ్రామంలోని 85 చేద బావుల్లో మూడు గజాల లోతులోనే నీళ్లు అందుతున్నాయి. 

ఇది మహిళల విజయం
మాకు నీళ్ల విలువ తెలుసు. నీటి సంరక్షణ కోసం కలసి పని చేద్దామని గ్రామస్తులను అడిగినప్పుడు అందరూ సహకరించారు. ఇప్పడు నీళ్లకు ఇబ్బంది లేదు. అనవసరంగా నీళ్లను తోడేసి వాడుకునే పద్ధతికి స్వస్తి పలికాం. అందరి కృషితోనే ఈ పని సాధ్యమైంది. ఇది మహిళల విజయం. 
    – మొగుల్ల శ్యామల, సర్పంచ్, గర్గుల్‌ 

మరిన్ని వార్తలు