కుటుంబ సభ్యులే హంతకులు

1 Jul, 2019 08:37 IST|Sakshi

హత్యకేసును ఛేదించిన పోలీసులు 

నిందితుల రిమాండ్‌  

సాక్షి, ధర్మసాగర్‌: జూన్‌ 23న ధర్మసాగర్‌ మండల కేంద్రంలో వ్యవసాయబావిలో వెలుగు చూసిన మృతుడి హత్య కేసును పోలీసులు ఛేదించి  నిందితులను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. ధర్మసాగర్‌ మండల కేంద్రానికి ఉపాధి కోసం వచ్చిన సాంబయ్యను కుటుంబసభ్యులు మరో వ్యక్తి సాయంతో  హత్య చేసి బావిలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి కథనం ప్రకారం... ధర్మసాగర్‌ మండల కేంద్రానికి చెందిన కొట్టె విజయ్‌ భాస్కర్‌ అతడి వ్యవసాయ బావిలో మృతదేహం ఉందనే సమాచారం మేరకు సదరు మృతదేహాన్ని వెలికి తీసి మృతుడు ధర్మసాగర్‌ మండల కేంద్రానికి బతుకుదెరువు కోసం వలసవచ్చిన అంబాల శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన సాంబయ్యగా గుర్తించారు.

అనంతరం హత్య కేసులో అనుమానితులు గా మృతుడి భార్య సారమ్మ, బావమరుదులు రమేష్, రాజు, కొడుకు భరత్‌ పక్కింటి వ్యక్తి మహేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో  మృతుడు తాగి వచ్చి నిత్యం వేధించటం, తరుచు దొంగతనాలకు పాల్పడుతుండటం, కుటుంసభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయటంతో అతడి చేష్టలను భరించలేక తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

జూన్‌ 17న సాంబయ్య కు తమ ఇంట్లోనే మద్యం తాగించిన అనంతరం మహేష్‌ తలపై గొడ్డలితో బలంగా నరకటం, భార్య సారమ్మ రోకలిబండతో బాదటంతోపాటు, భరత్, రమేష్, రాజులు అతడిని ఛాతిపై విచక్షణ రహితంగా పొడటంతో అక్కడిక్కడే మృతి చెందా డని తెలిపారు. అనంతరం వీరంతా కలిసి మృతదేహాన్ని టార్పాలిన్‌ కవర్లో చుట్టి వైర్లతో ప్యాక్‌ చేసి మహేష్‌కు చెందిన ట్రాలీ ఆటోలో తీసుకెళ్లి గ్రామసమీంలో ఉన్న వ్యవసాయబావిలో పొడవాటి బండరాళ్లతో కట్టి పడేసారు. కాగా నిందితులు నేరాన్ని అంగీకరించటంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో ధర్మసాగర్‌ ఎస్సై విజయ్‌రాంకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
  

మరిన్ని వార్తలు