సొంతింటి కల.. మరింత భారం

2 Jul, 2015 00:43 IST|Sakshi
సొంతింటి కల.. మరింత భారం

సాక్షి, హైదరాబాద్ : ప్రజలకుసొంతింటి కల ఇక మరింత భారం కానుంది. రైతులు అష్టకష్టాలు పడి పొదుపు చేసిన సొమ్ముతో ఎకరానో అరెకరానో పొలం కొనాలన్నా గగన కుసుమమే. ఇంటి జాగా కొనడమూ పెనుభారంగా మారనుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్థిరాస్తుల మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. భూములు, ఇళ్లు, స్థలాల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేపట్టింది. ‘‘మార్కెట్ విలువలు పెంచడం ఖాయం. ఇందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారు.

గ్రామాలు, పట్టణాలవారీగా భూములు, స్థలాల వాస్తవ విలువల ప్రాతిపదికన మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రెవెన్యూ డివిజనల్ అధికారులు/జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని మార్కెట్ రివిజన్ కమిటీల అనుమతి తీసుకోవాలి. ఈ దిశగా జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లను సన్నద్ధం చేయండి’’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ విలువల పెంపునకు మంత్రి కేఈ కృష్ణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేసి, సీఎం ఆమోదం నిమిత్తం పంపించారని, సీఎం దీనిని ఆమోదించడం లాంఛనప్రాయమేనని ఉన్నతాధికారులు వివరించారు. సీఎం ఆమోదిస్తే సవరించిన విలువలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి.

 భారీ ఆర్జనకు సర్కారు యత్నాలు
 భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు పెరగడంవల్ల కొనుగోలుదారులపై స్టాంపు డ్యూటీ భారం పెరుగుతుంది. మార్కెట్ విలువపై నాలుగు శాతం ఉన్న స్టాంపు డ్యూటీని ప్రభుత్వం ఇటీవలే ఐదు శాతానికి పెంచింది. రిజిస్ట్రేషన్ ఫీజును అర శాతం నుంచి ఒక శాతానికి పెంచింది. వివిధ రకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టేబుల్ ఫీజులను కూడా పెంచింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఇప్పుడు మళ్లీ  మార్కెట్ విలువలను సవరించడం ద్వారా భారీగా ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ‘ఇక మార్కెట్ రివిజన్ కమిటీలు ఆమోదించిన రిజిస్ట్రేషన్ విలువలే అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ విలువలతో పోల్చితే 20 నుంచి 30 శాతం వరకూ పెరుగుదల ఉండే అవకాశం ఉంది’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు