అక్రమాల్లో అగ్రగణ్యులు

14 Jun, 2014 04:13 IST|Sakshi
  •    బరితెగించిన కొందరు తహసీల్దార్లు
  •      కేసులు నమోదైనా ముందస్తు బెరుుల్
  •      దర్జాగా కొలువు.. మళ్లీ అక్రమాలు
  •      దర్యాప్తులో పోలీసుల జాప్యం
  •      శాఖాపరమైన చర్యలూ కరువు
  •      జిల్లా కలెక్టర్ ఉదాసీనత
  • సామాన్యులను నిబంధనల సాకుతో ఇబ్బంది పెట్టడంలో ఆరితేరిన రెవెన్యూ అధికారులు... నియమాలకు తిలోదకాలు ఇవ్వడంలోనూ ముందుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టే విషయంలో అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్యాయానికి గురైన వారు ఏకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదైనా... పోలీసులు విచారణలో జాప్యం చేస్తుండడంతో రెవెన్యూ అధికారులు ముందస్తు బెయిల్ పొంది దర్జాగా ఉద్యోగాలు చేస్తున్నారు. మళ్లీ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు.
     
    సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 24 మంది తహసీల్దార్లను పనితీరు సరిగా లేదనే కారణంతో జిల్లా కలెక్టర్ జి.కిషన్ నాలుగు రోజుల క్రితం భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)కు సరెండర్ చేశారు. ఈ సంఘటనతో రెవెన్యూ ఉద్యోగుల అక్రమాలు, ముఖ్యంగా తహసీల్దార్ల అక్రమాలు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేయడంపై చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో దాదాపు 12 మంది తహసీల్దార్లు తీవ్రమైన తప్పులు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    జిల్లాలో గతంలో పనిచేసిన వారు, ఇప్పుడు పనిచేస్తున్న వారిలో కొందరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణను పూర్తి చేయాల్సిన పోలీసు శాఖ... రెవెన్యూ వారికి వత్తాసు పలుకుతూ సామాన్య పౌరులకు న్యాయం దక్కకుండా చేస్తోంది. కేసుల విచారణ పూర్తిచేయకుండా సాగదీస్తోంది.

    సరెండర్ అంశంతో సంబంధం లేకుండా చాలా మంది తహసీల్దార్లు ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే హన్మకొండ, హసన్‌పర్తి, ములుగు, భూపాలపల్లి మండలాల్లో పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేస్తున్నారు. ఇలా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న, విధుల నిర్వహణ సరిగా లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఇప్పుడు ఎలాంటి పోస్టింగ్‌లు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
     
    అక్రమాల్లో రెవె‘న్యూ’..
     
    జిల్లాలోని రెవెన్యూ శాఖ కొత్త రకమైన అక్రమాలకు నాంది పలుకుతోంది. నకిలీ పాసుపుస్తకాలు, తప్పుడు ఆర్‌వోఆర్ రికార్డులు, పట్టాదారుల వివరాలు దిద్దుబాటు, భూముల రికార్డుల గల్లంతు... తదితర అక్రమాలన్నింటా జిల్లా వారే ముందుంటున్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణతో పాటు ప్రైవేటు భూముల రికార్డుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి భూములను ధారాదత్తం చేస్తున్నారు. సామాన్యులపై అధికార జులుం చూపే పోలీసు అధికారులు.. రెవెన్యూ వారి కేసులపై ఎంతకీ స్పందించడం లేదు. మండల స్థాయిలో మెజిస్టీరియల్ పవర్స్ ఉన్న అధికారులు కావటంతో తహసీల్దార్లతో ఉండే పనుల కోసం పోలీసులు రాజీపడుతున్నారు.
     
    రెవెన్యూ అధికారుల కేసుల తీరు ఇలా..

    ములుగు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఉన్న సమయంలో ఏటూరునాగారం నుంచి ఎన్.శివారెడ్డి అనే అధికారి అంబులెన్స్ వాహనంలో టేకు మొద్దులను అక్రమంగా తీసుకెళ్తుంటే పట్టుబడ్డారు. ఈయనపై కేసు నమోదైంది. తప్పుడు ధ్రువీకరణలతో ములుగు మండలంలోని మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీల అనుమతుల జారీలో పాత్ర ఉందనే కారణంతో ఆర్డీవో శివారెడ్డి, అప్పటి తహసీల్దారు ఎం.చక్రధర్‌లపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల సహకారంతో వీరిపై తదుపరి చర్యలు లేకుండాపోయూరుు.  

    సంగెం మండలం పల్లారుగూడెంలో సంచలనం రేపిన తండ్రీకొడుకుల హత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. భూ తగాదాలను, నకిలీ పాసు పుస్తకాల విషయమే దీనికి కారణమని తేలింది. ఆ కేసులో ఇద్దరు వీఆర్‌వోలు, ఒక వీఆర్‌ఏ సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు రికార్డుల ప్రకారం అప్పటి సంగెం తహసీల్దారు ఎండీ షఫియొద్దీన్ ఈ కేసులో ప్రధాన పాత్రధారుగా ఉన్నట్లు పేర్కొన్నారు. సంగెం తహసీల్దార్ ఎండీ షఫియొద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ ఖాజా మొహినొద్దీన్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

    ఆత్మకూరు మండలంలో నకిలీ పాసుపుస్తకాల కేసు రెండేళ్లుగా విచారణకు నోచుకోవడం లేదు. రెవెన్యూ, పోలీసుల పరస్పర సహకారం... సొంత శాఖ ఉద్యోగులపై రెవెన్యూ ఉన్నతాధికారులకు ఉండే ఇష్టంతో ఈ కేసు పెండింగ్‌లోనే ఉంటోంది. బ్రాహ్మణపల్లిలోని 21, 22 సర్వే నెంబర్‌లలో 20 ఎకరాల భూమి ఉంది. వారసత్వంగా తనకు చెందిన భూమిని రెవెన్యూ అధికారుల సాయంతో కొందరు అక్రమ పట్టాదారు పాసుపుస్తకాలు పొందారని హన్మకొండకు చెందిన పొట్లపల్లి వీరభద్రరావు 2012లో కోర్టును ఆశ్రయించారు. ఆర్‌వోఆర్ రికార్డులన్నీ ఫోర్జరీ చేసి అక్రమంగా పాసు పుస్తకాలు జారీ చేసినట్లు రెవెన్యూ అధికారులను బాధ్యులను చేశారు. స్పందించిన జిల్లా కోర్టు.. బాధ్యులపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించింది. 2012 జులైలో ఆత్మకూరు స్టేషన్‌లో (క్రైం నెం. 202/2012) ఈ కేసు నమోదైంది. వరంగల్ ఆర్డీవో శ్రీనివాస్, గతంలో ఆత్మకూరులో పనిచేసిన తహసీల్దార్లు బీఎస్.లత, ఎన్.స్వామి, హనుమంతరెడ్డి, వీఆర్‌వో విజయకుమార్‌తో పాటు మొత్తం 11 మంది బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వీరంతా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పోలీసులు, రెవెన్యూల మిత్రత్వంలో ఈ కేసులోనూ విచారణ జరగడం లేదు. నకిలీ పట్టాదారు పుస్తకాలను ప్రస్తుత ఆర్డీవో మధు రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ ఈ అధికారులపై ఎలాంటి శాఖాపరమైన చర్యలూ తీసుకోవడం లేదు.

    ఆత్మకూరు తహసీల్దారుగా ఉన్న యాదగిరి ఏబీసీకి చిక్కడంతో మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సంఘటన ఇటీవలే జరిగింది.

    మంగపేట మండలం బర్లగూడెంలో 2012లో అటవీ భూములకు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ పుస్తకాలతో అటవీ భూమిని విక్రయించిన రాజుపేట గ్రామస్తులను పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. అప్పటి తహసీల్దార్ నాగపురి కిష్టయ్య సహా తొమ్మిది మంది ఉద్యోగులపై కేసు నమోదైంది. వీరిపై కూడా ఎలాంటి శాఖాపరమైన చర్యలూ తీసుకోలేదు.
     

మరిన్ని వార్తలు