పైన రక్షణ.. కింద మాత్రం సమస్యలు!

15 Sep, 2019 04:49 IST|Sakshi

వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇది. భూమికి సుమారు 10–50 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఓజోన్‌ పొర హానికారక రేడియో ధారి్మకత నుంచి భూమిని రక్షిస్తుంటే.. పెట్రోల్, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాల వాడకం వల్ల భూమ్మీద తయారయ్యే ఓజోన్‌ వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాహనాల పొగలోని నైట్రోజన్‌ ఆక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్‌ల రసాయన చర్య వల్ల ఓజోన్‌ తయారవుతుంది. అదీ ప్రతి వంద కోట్ల అణువులకు గరిష్టంగా వంద వరకు ఓజోన్‌ అణువులు ఉండొచ్చు అంతే. కానీ అవే రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. ఇక భూమి పైపొరల్లోని ఓజోన్‌ గురించి మాట్లాడుకుందాం. భూమ్మీద ఉన్న ఓజోన్‌లో 90 శాతం స్ట్రాటోస్ఫియర్‌లోనే ఉంటుంది. యూవీ–బీ కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంటుంది ఓజోన్‌ పొర. అతి నీలలోహిత కిరణాలు మూడు రకాలు యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ. యూవీ–ఏ కిరణాల శక్తి తక్కువ కాబట్టి ప్రభావమూ అంతగా ఉండదు. యూవీ–సీ స్ట్రాటోస్ఫియర్‌లో ఆక్సిజన్‌తో కలసిపోవడం వల్ల భూమిని చేరే అవకాశం లేదు. యూవీ–బీతోనే సమస్య అంతా. ప్రమాదకరమైన ఈ యూవీ–బీ కిరణాలు తగిలినప్పుడు ఓజోన్‌ కాస్తా.. ఆక్సిజన్‌ (ఓ2), ఆక్సిజన్‌ అణువుగా విడిపోతాయి. ఆ తర్వాత ఈ రెండూ కలిసిపోయి ఓజోన్‌గా మారతాయి.

ఓజోన్‌తో సమస్య ఇది..
భూ వాతావరణంలోకి చేరుతున్న కొన్ని రసాయనాల కారణంగా ఓజోన్‌ పొర పలుచన కావడం, చిల్లు పడుతోందని శాస్త్రవేత్తలు 1970లలోనే గుర్తించారు. సాధారణంగా స్ట్రాటోస్ఫియర్‌లో ఒకపక్క ఓజోన్‌.. ఆక్సిజన్‌ పరమాణువులుగా విడిపోతుంటే ఇంకోవైపు ఈ పరమాణవులన్నీ కలిసిపోయి ఓజోన్‌ ఏర్పడుతుంటుంది. ఈ వాతావరణ పొరలో ఉండే నైట్రోజన్, హైడ్రోజన్‌ వంటి ఇతర వాయువులు కూడా ఓజోన్‌తో రసా యన చర్య జరపడం వల్ల సమస్యలు వస్తాయి. ఇవి కాస్తా ఓజోన్‌ ఆక్సిజన్‌గా మారకుండా నిరోధిస్తుంటాయి. ఫలితంగా ఓజోన్‌ వాయువు మోతాదు తగ్గుతూ వస్తుంది. మానవ చర్యల కారణంగా వాతావరణంలోకి చేరే క్లోరిన్, బ్రోమిన్‌లు కూడా సమస్యను జటిలం చేస్తున్నాయి. ఓజోన్‌ పొరకు చిల్లుపెట్టే వాయువుల్లో క్లోరోఫ్లోరోకార్బన్స్‌ (ఫ్రిజ్‌లు, డియోడరెంట్‌ క్యాన్లు, షేవింగ్‌ ఫోమ్, హిట్‌ వంటి కీటకనాశనుల్లో వాడతారు) ముఖ్యమైనవి కాగా.. హైడ్రో క్లోరోఫ్లోరో కార్బన్స్, హాలోన్స్, మిథైల్‌ బ్రోమైడ్స్‌ వంటివీ ప్రమాదకరమైనవే. మన కంప్యూటర్లు, ఇతర ఎల్రక్టానిక్‌ పరికరాలను శుభ్రం చేసేందుకు వాడే సాల్వెంట్స్, కార్‌ డ్యాష్‌బోర్డు, ఇళ్లు, ఆఫీసుల్లో వేడి నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఫోమ్, అగ్నిమాపక యంత్రాల్లో వాడే రసాయాలన్నీ ఓజోన్‌ పొరకు చేటు తెచ్చేవే.

మరిన్ని వార్తలు