సిరులు  పండాయి!

5 Oct, 2019 02:44 IST|Sakshi

ఈ ఖరీఫ్‌లో 21 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేయనున్న ఉత్పత్తి

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతుందని సర్కారు అంచనా వేస్తోంది. 21 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే దిశగా వరి ఉత్పత్తి కానుందని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగా, ఇప్పుడు దాన్ని కూడా దాటేస్తుందని అధికారులు అంచనా. గత ఖరీఫ్‌లో 61.55 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా, ఈ ఖరీఫ్‌లో 66.07 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి కానుందని వెల్లడించాయి. 2019–20 ఖరీఫ్‌ సీజన్‌ గత నెలాఖరుతో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ పంటల మొదటి ముందస్తు అంచనా నివేదికను అర్థ గణాంక శాఖ తాజాగా విడుదల చేయగా, వివరాలను వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషించాయి. ఈ ఏడాది 28.75 లక్షల ఎకరాల్లో నాట్లు పడతాయని, 59.57 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ తన ప్రణాళికలో ప్రకటించింది. కానీ నైరుతి రుతుపవనాలతో పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, జలాశయాలు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో 31.67 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. దీంతో వరి రికార్డులను బద్దలుకొట్టనుంది. 

పత్తి ఉత్పత్తి కూడా భారీనే...
ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, 1.10 కోట్ల ఎకరాల్లో సాగయ్యింది. అందులో అత్యధికంగా పత్తి సాగైంది. దాని సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 46.48 లక్షల ఎకరాల్లో (108 శాతం) సాగైంది. పప్పు ధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా... 9.42 లక్షల (91 శాతం) ఎకరాల్లో సాగు చేశారు. పత్తి గతేడాది 41 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా, ఈసారి 45.93 లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతుందని సర్కారు అంచనా వేసింది. మొక్కజొన్న 13.79 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వస్తుందని పేర్కొంది. ఇక కందులు 7.11 లక్షల ఎకరాల్లో సాగు కాగా 1.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి రానున్నట్లు పేర్కొంది. జొన్నలు 42 వేల మెట్రిక్‌ టన్నులు, పెసర 45 వేల మెట్రిక్‌ టన్నులు, వేరుశనగ 30 వేల మెట్రిక్‌ టన్నులు, సోయాబీన్‌ 2.82 లక్షల మెట్రిక్‌ టన్నులు, పసుపు 3.14 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి కానుందని అంచనా వేసింది. ఉత్పత్తి పెరుగుతుం డటంతో సర్కారు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై దృష్టి సారించింది. దీని ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని నిర్ణయిం చారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు ముమ్మరం చేశారు.   మరోవైపు నైరుతి సీజన్‌లో కురిసిన వర్షాలతో రబీ సీజన్‌ కూడా ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు