అభివృద్ధి కోసం పరిశోధనలపై దృష్టి పెట్టాలి

22 Dec, 2019 03:55 IST|Sakshi

పద్మభూషణ్‌ జి.పద్మనాభన్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక, సామాజిక శక్తిగా ఎదగాలన్న భారత్‌ ఆకాంక్ష నెరవేరాలంటే మౌలిక పరిశోధనలపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిందేనని పద్మభూషణ్‌ జి.పద్మనాభన్‌ స్పష్టం చేశారు. ఐటీ, అంతరిక్ష పరిశోధనల్లో దేశం ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానవాభివృద్ధి సూచీల్లో 129వ స్థానంలో ఉండటం, ఆరోగ్య సేవల విషయంలో ప్రపంచదేశాల జాబితాలో అట్టడుగు భాగంలో ఉండటం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో (నార్మ్‌) శనివారం ఓ జాతీయ సదస్సు ప్రారంభమైంది. ‘శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వ్యాపారాభివృద్ధి’ అనే అంశంపై నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆఫ్‌ ఇండియా (నాసి) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పద్మనాభన్‌ మాట్లాడుతూ.. దేశ వ్యవసాయ, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఐటీ, అంతరిక్ష పరిశోధనలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్‌ ఎ.వి.రామారావు, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ మంజు శర్మ, నాసి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సత్యదేవ్, నార్మ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు