పద్మకు చుక్కెదురు

11 Nov, 2018 11:09 IST|Sakshi
రోడ్డుకు అడ్డంగా బిందెలు ఉంచి నిరసన వ్యక్తం చేస్తున్న ఉప్పరి బస్తీ మహిళలు

ప్రచారానికి రావొద్దని బిందెలు 

 అడ్డం పెట్టిన కాలనీవాసులు 

 పద్మాదేవేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన యువకులు 

రామాయంపేట(మెదక్‌): మెదక్‌ నియోజకర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారంలో చుక్కెదురైంది. శనివారం రామాయంపేట పట్టణంలో నిర్వహించిన ప్రచారానికి నిరసన సెగ తగిలింది. ఒక వైపు ఆమె  కార్యకర్తలతో కలిసి ఉప్పరి బస్తీలో ప్రచారం నిర్వహిస్తుండగా, పక్కనే ఉన్న వీధుల మహిళలు  రోడ్డుకు అడ్డంగా ఖాళీ బిందెలు ఉంచి మా ఇళ్ల వద్దకు ప్రచారాని రావొద్దని నిరసన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తాము నీటి ఎద్దడి ఎదుర్కుంటున్నా.. ఏనాడు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఓట్లప్పుడే వస్తున్న నాయకులు తమ సమస్యలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని వారు నిరసన వ్యక్తం చేశారు.

 స్థానిక నాయకులు వారిని సముదాయించి రోడ్డుకు అడ్డంగా పెట్టిన బిందెలను తొలగించగా, తర్వాత పద్మ అక్కడికి చేరుకొని మహిళలతో మాట్లాడారు. గల్లీల్లో పైప్‌లైను పనులు జరుగుతున్నాయని, మరో 15 రోజుల్లో ఇంటింటికీ నీరు అందుతుందని చెప్పి ఆమె  ప్రచారానికి వెళ్లిపోయారు.  మరోవైపు అక్కలబస్తీలో యువకులు కొందరు రోడ్డుకు అడ్డంగా నిలబడి పద్మకు, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ కాలనీలో నయాపైసా పనులు చేయలేదని, కనీసం వార్డు సభ్యుడు చేసిన పనులు సైతం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వారు స్థానిక నాయకులను అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి సదరు యువకులను సముదాయించారు.  కాగా కాలనీల్లో ఇంతవరకు పైప్‌లైను నిర్మాణం పనులు ప్రారంభం కాకపోవడంతో పద్మాదేవేందర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు.
 

మరిన్ని వార్తలు