కాళేశ్వరం నిర్వాసితులను ఆదుకుంటాం

30 Jun, 2019 14:09 IST|Sakshi
చెక్కులు  అందిస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 

సాక్షి,మెదక్‌: కాళేశ్వరం కాలువ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం చిన్నశంకరంపేట తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో శంకరంపేట కాలువకోసం భూములు అందించిన మడూర్‌ గ్రామ రైతులకు 26 ఎకరాలకు రూ.1కోటి94 లక్షలను 94 మంది రైతులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. కాళేశ్వరం కాలువ కోసం భూములను అందిస్తున్న రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.

ప్రభుత్వ నష్టపరిహారంతో పాటు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకరంపేట కాలువ ద్వారా మండలంలోని 18 వేల ఎకరాల భూములకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. దీంతో రైతుల భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. కరువును పారదోలి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా నార్సింగి మండలంలోని శేరిపల్లి, జప్తిశివనూర్, సంకాపూర్‌ గ్రామాల కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రె కృపావతి, వైస్‌ ఎంపీపీ విజయలక్ష్మి, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, నూతన జెడ్పీటీసీ పట్లోరి మాధవి, నార్సింగి వైస్‌ ఎంపీపీ సుజాత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్‌లు మల్లేశం, షరీఫ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు