గొప్ప మానవతావాది పద్మనాభరెడ్డి

28 Dec, 2018 01:25 IST|Sakshi

న్యాయవాదిగా సుదీర్ఘ ప్రస్థానం 

విలువలకు నిలువెత్తు దర్పణం  

న్యాయవ్యవస్థకు విలువైన  సేవలందించిన ఖ్యాతి ఆయనదే..

సాక్షి, హైదరాబాద్‌: నీతి, నిజాయితీ, విలువలకు తుదివరకు కట్టుబడి త్రికరణశుద్ధిగా న్యాయవాద వృత్తిని కొనసాగించిన అరుదైన అతికొద్దిమంది న్యాయవాదుల్లో చాగరి పద్మనాభరెడ్డి ఒకరు. ఉభయ రాష్ట్రాల్లో పద్మనాభరెడ్డి గురించి తెలిసిన ప్రతీఒక్కరూ చెప్పేమాట ఇదే. తాను నమ్మిన విలువలద్వారా ప్రజల హక్కుల్ని కాపాడిన గొప్ప మానవతావాది ఆయన. కేసుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మొదలు ఆపన్నులకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో ఆయన తరువాతే ఎవరైనా. ఆయన్నుంచీ నేర్చుకోవాల్సిన సుగుణాలెన్నో ఉన్నాయని విశ్రాంత న్యాయమూర్తులు, ప్రస్తుత న్యాయమూర్తులు ముక్తకంఠంతో చెబుతారు. వామపక్షవాదిగా చివరివరకు ప్రజా ఉద్యమాలకు తన అండదండలు అందించారు. 2013, ఆగస్టు 4న ఆయన తుదిశ్వాసవిడిచారు. 

ఆయనకు గురువే దైవం.. 
అనంతపురంజిల్లా యాడికి గ్రామంలో 1931, మార్చి 18న మధ్యతరగతి కుటుంబంలో పద్మనాభరెడ్డి జన్మించారు. తండ్రి ఓబుల్‌రెడ్డి, తల్లి సోమక్క. 5వ తరగతి వరకు యాడికి వీధి బడిలో చదివారు. 6 నుంచి 8 తరగతుల్ని తాడిపత్రి మున్సిపల్‌ హైస్కూలులో చదివారు. గుత్తిలోని లండన్‌ మిషన్‌ హైస్కూల్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. తరువాత గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసి, అనంతపురం గవర్నమెంట్‌ కాలేజీలో బీఎస్సీ, మద్రాస్‌ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1953లో మద్రాస్‌ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కొంతకాలం అక్కడే ప్రాక్టీస్‌ చేసి 1954లో గుంటూరు(ఆంధ్ర హైకోర్టు)లో, 1956లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ప్రాక్టీస్‌ మార్చారు. ప్రముఖ న్యాయకోవిదులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఓ.చిన్నపరెడ్డిని ఆయన దైవంగా భావించారు. చిన్నపరెడ్డే తన గురువూ, మార్గదర్శకుడిగా చెప్పేవారు. తాను సాధించినదంతా చిన్నపరెడ్డి చలవేనని, ఆయన చూపిన ప్రేమాభిమానాల్ని ఎన్నటికీ మరిచిపోలేమని ఎంతో వినమ్రంగా చెప్పేవారు.  

సుదీర్ఘ ప్రస్థానం..: పద్మనాభరెడ్డిది న్యాయవాదిగా 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. అంతకాలంపాటు ఆయన క్రిమినల్‌ లాయర్‌గా న్యాయవ్యవస్థకు సేవలందించారు. ఎంతోమంది న్యాయమూర్తులు తమ సందేహాలను ఆయనద్వారా నివృత్తి చేసుకునేవారు. హైకోర్టులో అరవై వేలకుపైగా కేసులు వాదించిన ఆయన.. ఫీజులతో నిమిత్తం లేకుండా కేసుల్ని వాదించేవారు. ఎన్నడూ ఫీజుకోసం అడిగింది లేదు. ఫీజు ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు ఒకవేళ అప్పోసొప్పో చేసి ఫీజు తెచ్చి ఉంటే.. ఆ విషయాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ డబ్బును వారికే తిరిగిచ్చేవారు. ఒక్కోసారి చార్జీలకు సైతం ఆయన తన జేబులోనుంచి డబ్బుతీసి వారికిచ్చేవారని ఆయన్ను దగ్గరనుంచి చూసిన న్యాయవాదులు చెబుతుంటారు. ఎన్‌కౌంటర్ల సమయంలో ఎదురుకాల్పులు జరిగినప్పుడు, పోలీసుల కాల్పుల్లో ఎవరైనా చనిపోతే, అందుకు బాధ్యులైన పోలీసులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలా? వద్దా? అన్న సందేహం హైకోర్టుకు వచ్చింది. సందేహనివృత్తికి వెంటనే హైకోర్టుకు గుర్తుకొచ్చేది పద్మనాభరెడ్డే. ఈ అంశంపై విచారణ జరిపిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కోర్టు సహాయకారి(అమికస్‌ క్యూరీ)గా పద్మనాభరెడ్డిని నియమించింది. ఆత్మరక్షణకోసం ఎదురుకాల్పులు జరిపామని పోలీసులు కోర్టులో నిరూపించుకోవాలని, కేసు నమోదు చేయకుండా పోలీసులే తీర్పునివ్వడం చట్టవ్యతిరేకమని ఆయన వాదించారు. ఆయన వాదనల్ని అంగీకరించిన ధర్మాసనం.. ఎన్‌కౌంటర్‌లలో అవతలి వ్యక్తులు మృతిచెందితే అందులో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేయాలని సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది.  

అపార పరిజ్ఞానం ఆయన సొంతం
తనకున్న అపార పరిజ్ఞానంతో కేసులో వైరుధ్యాలను, చట్టవ్యతిరేక అంశాలను, సాక్ష్యాలను, సహజ న్యాయశాస్త్ర ఉల్లంఘనలను పద్మనాభరెడ్డి సులభంగా ఎత్తిచూపేవారు. ఇంత పరిజ్ఞానము న్నా ఆయన అతి సాధారణ వ్యక్తిగానే చెలామణి అయ్యారు. ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించి ఎరుగరు. ఎవరు ఏ సలహా అడిగినా విసుగూ, విరా మం లేకుండా చెప్పడం ఆయనకే చెల్లింది. రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన కేసుల్ని వాదిం చారంటూ ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా నివేదికివ్వడంతో పద్మనాభరెడ్డి హైకోర్టు జడ్జి కాలేకపోయారు. కానీ ఆయన కుమారుడు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌  ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక సీజే గా నియమితులై చరిత్ర సృష్టించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు