మహిళలు, పిల్లలకు రక్షణలేని దేశం ముందుకు పోలేదు

18 May, 2019 01:05 IST|Sakshi
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న పద్మనాభరెడ్డి

ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సెక్రటరీ పద్మనాభరెడ్డి 

హైదరాబాద్‌: మహిళలకూ, పిల్లలకూ రక్షణ కల్పించలేని దేశం ఎన్నటికీ ముందుకు పోలేదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవ ర్నెన్స్‌ సెక్రటరీ పద్మనాభరెడ్డి అన్నారు. మహిళలు ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుదీరుతారని పురాణాల్లో ఉందని, చదువుల కోసం సరస్వతిని, డబ్బు కోసం లక్ష్మీదేవిని పూజించడం మన సంస్కృతిలోనే ఉందని, కానీ ఆ మహిళలకూ, పిల్లలకూ రక్షణ లేకుండా పోయిందన్నారు. కైలాస్‌ సత్యార్థి పిల్లల ఫౌండేషన్, నెట్‌వర్క్‌ ఆఫ్‌ ప్రొటెక్షన్‌ చైల్డ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అత్యాచార రహిత భారతదేశం’కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకుల ప్రతిజ్ఞ పోస్టర్‌ను ఆయన శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లల భద్రత కోసం రాజకీయ నాయకుల వద్ద ప్రతిజ్ఞ తీసుకోవడం ఎంతో మంచి కార్యక్రమమే, కానీ నేతలు మాటపై నిలబడతారన్న నమ్మకం ఉండటంలేదన్నారు. పిల్లల రక్షణలో భారతదేశం ప్రపంచంలో 97వ స్థానంలో ఉందని, ఇది విచారకరమని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచార కేసుల సత్వర పరిష్కారానికి ప్రతిరాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, బాధితులకు ఏడాదిలోపు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, పిల్లల రక్షణ, భద్రత, చదువు కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని సూచించారు. 

రాజకీయ పార్టీలతోనే పరిష్కారం..
కైలాస్‌ సత్యార్థి పిల్లల ఫౌండేషన్‌ ప్రతినిధి రమణ్‌ చావ్లా మాట్లాడుతూ పిల్లలు, మహిళల భద్రతలేమి అనేది సామాజిక సమస్య అనీ, దీన్ని రాజకీయ పార్టీల నేతల చొరవతోనే పరిష్కరించగలమని అన్నారు. అత్యాచారరహిత భారతదేశం కోసం అన్ని రాజకీయ పార్టీల నేతల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నామని, ఎన్నికల్లో గెలవగానే పార్లమెంట్‌లో గళం విప్పేలా చూడటం, కేంద్ర బడ్జెట్‌లో పిల్లలు, మహిళల భద్రత కోసం 10 శాతం బడ్జెట్‌ కేటాయించే విధంగా కృషి చేయడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 450 మంది ఎంపీలు, పార్టీల ప్రముఖులు ప్రతిజ్ఞాపత్రంపై సంతకం చేసినట్లు చెప్పారు.

తెలంగాణలో కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి లాంటి ప్రముఖులతోపాటు 34 మంది ఎంపీ అభ్యర్థులు, నేతలు ప్రతిజ్ఞాపత్రంపై సంతకం చేసి తమ ఉద్యమంలో భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. తమతోపాటు సుమారు 50 వరకు స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొంటున్నాయ ని చెప్పారు. ఎన్నికల ఫలితాలు రాగానే గెలిచిన ఎంపీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల రక్షణ కోసం పార్లమెంటులో గళం విప్పేలా చొరవ తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశ్రిత, ఎస్‌ఆర్‌డీ, బచ్‌పన్‌ బచావో ఆందోళన్, ఎంబీ ఫౌండేషన్‌ ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు