‘వీవీ ప్యాట్‌’ల లెక్కింపునకు ఆదేశాలివ్వండి

31 Jan, 2019 04:36 IST|Sakshi

హైకోర్టును ఆశ్రయించిన పద్మావతిరెడ్డి, అద్దంకి దయాకర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల తమ నియోజకవర్గాల పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు పద్మావతిరెడ్డి, అద్దంకి దయాకర్, బీఎస్‌పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. ఫిబ్రవరి 7 లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ కౌంటర్‌కు 14వ తేదీ లోపు తిరుగు సమాధానం ఇస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ఫిబ్రవరి 14న తదుపరి విచారణ చేపడతామంది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎంల ద్వారా తమకు వచ్చిన ఓట్లకు, వీవీ ప్యాట్‌లలో నమోదైన ఓట్లకు తేడా ఉందని, అందువల్ల వీవీ ప్యాట్‌లలో ఓట్లను లెక్కించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ కోదాడ కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతిరెడ్డి, తుంగతుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి అద్దంకి దయాకర్‌లు హైకోర్టులో తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై మల్‌రెడ్డి రంగారెడ్డి గతంలోనే పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
 
వీవీ ప్యాట్‌లను లెక్కించలేదు..
పిటిషనర్ల తరఫున తూమ్‌ శ్రీనివాస్‌ తదితరులు వాదనలు వినిపిస్తూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో 18 ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, అందువల్ల వీవీ ప్యాట్‌ల ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు వేసిన ఫలితం ఈవీఎంలపై కనిపించనప్పుడు, నిబంధనల ప్రకారం ఆ ఈవీఎంలను పక్కన పెట్టేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక, ఈ పనిచేయని ఈవీఎంల వీవీ ప్యాట్‌లను లెక్కించాల్సి ఉంటుందని, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో అలా జరగలేదన్నారు.

వీవీ ప్యాట్‌ స్లిప్పులు థర్మల్‌ పేపర్‌పై ముద్రితమవుతాయని, నిపుణులు చెప్పే దానిని బట్టి వీటిపై ముద్రితమైన వివరాలు 45 రోజుల్లో తుడిచిపెట్టుకుపోతాయన్నారు. ఇలా జరిగితే తాము ఈ వ్యాజ్యాలు దాఖలు చేసి ఎటువంటి ప్రయోజనం ఉండదని నివేదించారు. పిటిషనర్ల వాదనలను ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ తోసిపుచ్చారు. థర్మల్‌ ప్రింట్‌ ఐదేళ్ల వరకు ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వివరాలన్నింటితో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలిపింది. 


 

మరిన్ని వార్తలు