చిత్రం రమణీయం.. నటన స్మరణీయం

14 Aug, 2019 12:04 IST|Sakshi
మహిళ వేషధారణలో..

పెయింటింగ్స్‌లో అద్భుత ప్రతిభ

సినిమాలు, నాటకాల్లోనూ రాణింపు     

‘మట్టిలో మాణిక్యాలు’ పాత్రకు నంది పురస్కారం  

రెండు కళారంగాల్లో తనదైన ముద్రవేస్తున్న కమల్‌

అతడి కుంచె నుంచి జాలువారిన చిత్రాలు ప్రకృతి రమణీయతకు, గ్రామసీమలవాతావరణానికి అద్దం పడుతున్నాయి. నాటక, సినీ రంగాల్లోనూ రాణించడంతో ప్రశంసలు అందుతున్నాయి. ఒకవైపు చిత్రకళలో, మరోవైపు నటనా రంగంలో తనదైన వైవిధ్యాన్ని చాటుతున్నారు నగరంలోని వెంగళరావునగర్‌కు చెందిన చిత్రకారుడు కమల్‌. ఇప్పటికే పలు చిత్రకళా ప్రదర్శనలతో ముందుకు సాగుతున్నారు. నాటకాలు,
సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోపుట్టి పెరిగిన ఆయన తన నేపథ్యాన్నిమరవకుండా పల్లె ఆత్మను తన చిత్రకళలోఆవిష్కరిస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ :సూర్యాపేట జిల్లా కోదాడ వాస్తవ్యుడైన కమల్‌కు చిన్నప్పటి నుంచే చిత్రలేఖనం అంటే మక్కువ. పాఠశాలలో చదివేటప్పుడు ఎలాంటి పెయింటింగ్‌ వర్క్‌ ఉన్నా ఉపాధ్యాయులు కమల్‌తోనే వేయించేవారు. అలా చిత్రకళపై పట్టు సాధించారు. ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. అనంతరం కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైనా చిత్రలేఖనం కళపై ఇష్టంతో  అందులో చేరలేదు. కుటుంబానికి భారం కావడం ఇష్టంలేక ఒకవైపు వ్యవసాయం చేస్తూ మరోవైపు దుకాణాలు, షాపులకు సంబంధించిన బోర్డులు, చిన్నచిన్న పెయింటింగ్స్‌ వేసేవారు. ఈ క్రమంలో కమల్‌కు సినిమాలపై ఆసక్తి పెరిగింది. దీంతో ఏకంగా చెన్నై వెళ్లారు. అక్కడ ఐదేళ్లు ఉన్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చారు. నగరంలో బీఎఫ్‌ఏ కోర్స్‌ పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి నాటక రంగంలో ఎంఏ పూర్తి చేశారు. అప్పటినుంచి పూర్తిస్థాయిలో పెయింటింగ్స్‌పైనే దృష్టి సారించారు. పలు గ్రూప్‌ షోలలో పాల్గొంటున్నారు. మరోవైపు సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ తన అభిరుచికి సాన పెడుతున్నారు. 

పెయింటింగ్‌ వేస్తున్న కమల్‌
ఎంతో సంతృప్తిగా ఉంది..
చిన్నప్పటి నుంచే చిత్రలేఖనం, నాటకరంగం అంటే చాలా ఇష్టం. వీటినే వృత్తిగా స్వీకరించాను. ఇప్పటివరు 35కుపైగా సినిమాలు, సీరియల్స్‌లో నటించాను. చిరుత, పప్పు, మిస్టర్‌ గిరీశం సహా పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించాను. ‘మట్టిలో మాణిక్యాలు’ చిత్రంలో వేసిన పాత్రకు నంది అవార్డు వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకు సోలో పెయింటింగ్‌ ప్రదర్శన ఇవ్వలేకపోయాను. భవిష్యత్‌లో సోలో ఎగ్జిబిషన్‌ తప్పకుండా చేస్తాననే నమ్మకం ఉంది. వెంగళరావునగర్‌ ప్రాంతంలోని పిల్లలకు పెయింటింగ్‌ పాఠాలు చెప్పడం ఎంతో సంతృప్తినిస్తోంది.      – కమల్, చిత్రకారుడు, నటుడు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా