చరిత్రకు చిత్రిక పట్టారు!

29 Jul, 2018 01:34 IST|Sakshi

చిత్రాల రూపంలో కాకతీయుల చరిత్ర

ఓరుగల్లు ఖిల్లాలో ఇళ్లకు పెయింటింగ్‌

రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ తరహాలో రంగులు

పరుసవేది నుంచి ప్రతాపరుద్ర పరాజయం వరకు..

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

పర్యాటక శాఖ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ భాగస్వామ్యం

సాక్షి, హైదరాబాద్‌: చెరువులు.. పట్టణాలు.. ఆలయాలు (త్రిబుల్‌ టీ) స్ఫూర్తితో పాలన సాగించిన కాకతీయుల చరిత్రను ప్రస్తుత తరాలకు కళ్లకు కట్టినట్లు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. వ్యవసాయం, అనుంబంధ వర్గాలకు చేయూత నిచ్చేలా పాలించిన కాకతీయుల వైభవాన్ని చిత్రాల రూపంలో అందరికీ తెలియజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాకతీయుల పరిపాలన కేంద్రం ఖిలా వరంగల్‌లోని ప్రస్తుత గృహాలపై వారి పరిపాలన ప్రస్థానాన్ని, వైభవాన్ని చిత్రీకరించనున్నారు. పర్యాటక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో జవహర్‌లాల్‌ నెహ్రూ హస్తకళల విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) విద్యార్థులు భాగస్వాములవనున్నారు.

120 ఇతివృత్తాలు
ఖిలా వరంగల్‌లో కాకతీయుల నాటి సంఘటనలు గుర్తుకు తెచ్చేలా 120 ఇతివృత్తాలను పర్యాటక శాఖ ఎంపిక చేసింది. వీటి ఆధారంగా ఇళ్లపై బొమ్మలను తీర్చిదిద్దనున్నారు. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని ఇళ్లన్నీ ఒకేలా కనిపిస్తూ పర్యాటకులను ఆలరిస్తాయి. అదే తరహాలో ఖిలా వరంగల్‌లోని నిర్మాణాలపై నీలిరంగుతో కాకతీయ ఘట్టాలను బొమ్మలుగా వేయనున్నారు. పరుసవేది లభించడం నుంచి ప్రతాపరుద్రుడి పరాజయం వరకు సంఘటలను చిత్రించనున్నారు.

ఖిలా వరంగల్, కాకతీయ కీర్తితోరణాలు, ఖుష్‌ మహల్‌ చూసేందుకు వచ్చే పర్యాటకులకు కాకతీయ యుగంపై అవగాహన వచ్చేలా ఈ చిత్రాలు కనువిందు చేయనున్నాయి. తొలిదశలో పడమర కోట ముఖద్వారం నుంచి ఖుష్‌మహల్‌ వరకు ఉన్న ఇళ్లను ఎంపిక చేశారు. రోడ్డు వైపు ఉన్న గోడలపై కా>కతీయుల చరిత్రను తెలిపేలా చిత్రాలు వేయనున్నారు. పడమర కోట ముఖ ద్వారంలో ప్రయోగాత్మకంగా 3 చిత్రాలు వేశారు. త్వరలోనే ఈ పనులు పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి.

ఏకశిల గుట్ట.. ఐనవోలు తోరణం..
కాకతీయుల రాజ్య స్థాపకుడు గుణ్యన నుంచి మొదలు రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వరకు కీలక ఘట్టాలను పర్యాటక శాఖ ఎంపిక చేసింది. కాకతీయులు జైనం నుంచి శైవంలోకి మారారు. వేలాది శివాలయాలు నిర్మించారు.

శైవారాధన చేసే చిత్రాలు, కాకతీయ కళా తోరణం, హన్మకొండ ప్రవేశద్వారం, హన్మకొండ కోట, ఎండ్ల బండ్ల వరుస, భూమిలో బండి కూరుకుపోవడం, ఇనుప కమ్మి బంగారంలా మారడం, రాజుగారికి తెలియజేయడం, ప్రోలరాజు గురువులతో కలసి రావడం, పరుసవేది శివలింగం, కోట నిర్మాణం ప్రారంభం, పరుసవేది ప్రతిష్టాపన, స్వయంభూ ఆలయ నిర్మాణం, 7 కోట గోడలు, మట్టి ఆకారం కోసం అగడ్తల తవ్వకం, తోరణ స్తంభాల ఏర్పాటు, మట్టికోట–రాతికోట–ఇటుక కోట–పుట్టకోట నిర్మాణాలు, గొలుసుకట్టు చెరువులు, మెట్ల బావుల నిర్మాణం, సైనికుల శిక్షణ, వ్యవసాయం, చేనేత, కళలు, తోటలు, రెండు అంతస్తుల బంగ్లాలు, ఏకశిల గుట్ట, ఐనవోలు తోరణం, జైన–శైవ–వైష్ణవ, భైరవ పూజ, పేరిణి నాట్యం, సింహద్వారం, మోటుపల్లి రేవు, వెయ్యి స్తంభాల ఆలయం, రామప్పలోని నంది, కుష్‌ మహల్, రుద్రమదేవి అబ్బాయిగా వేషధారణ వంటి ఎంపిక చేసిన ఘట్టాలను బొమ్మలుగా వేయనున్నారు. 

మరిన్ని వార్తలు