పారిశుధ్య పనులకు పైసల్లేవ్!

28 Sep, 2014 03:59 IST|Sakshi
పారిశుధ్య పనులకు పైసల్లేవ్!

పేరుకుపోయిన చెత్తాచెదారం.. పూడుకుపోయిన డ్రైనేజీలు.. రోడ్లపైనే పారుతున్న మురుగునీరు.. వెదజల్లుతున్న దుర్గంధం.. విజృంభిస్తున్న దోమలు.. పారిశుధ్యం అస్తవ్యస్తం.. విషజ్వరాలు, అంటువ్యాధులతో జనం సతమతం.. ఇదీ జిల్లాలోని మెజారిటీ గ్రామాల ముఖచిత్రం. పారిశుధ్య పనులు చేద్దామంటే గ్రామపంచాయతీల్లో పైసల్లేవ్. కేంద్రం నుంచి రావాల్సిన రూ.1.20 కోట్లు పెండింగ్  ఉండగా, రాష్ట్రం నుంచి కనీస సాయం అందడం లేదు.
 
 సాక్షి, కరీంనగర్:
 జిల్లాలో పారిశుధ్య నిర్వహణ అటకెక్కింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడం... పన్ను వసూళ్లు మందగించడంతో గ్రామపంచాయతీలకు నిధులు కొరువవడంతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. విషజ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగీ విజృంభిస్తోంది. గ్రామీణ పారిశుధ్య నిర్వహణ కోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుంది. జిల్లాలో 1,207 పంచాయతీలున్నాయి. అన్ని గ్రామాలకు రూ.కోటి 20 లక్షల 70 వేలు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవి జిల్లా వైద్యశాఖాధికారుల పరిధిలోని ఎన్‌ఆర్‌హెచ్‌ఎం విభాగాల ఆన్‌లైన్ ఖాతాలో జమ అవుతాయి. వీటి నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం(పీహెచ్‌సీ) మెడికల్ ఆఫీసర్ ఖాతాలోకి వస్తాయి. వీటిని సదరు మెడికల్ అధికారులు సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి, ఏఎన్‌ఎం ఉమ్మడి ఖాతాలో జమచేస్తారు. నిధులు వచ్చిన తర్వాత సర్పంచ్, వార్డుసభ్యుడు, మెడికల్ ఆఫీసర్‌తోపాటు అవసరమైతే ఎంపీపీ సమావేశమై నిధుల వినియోగంపై చర్చించి తీర్మానం చేస్తారు. ఆ తీర్మానం మేరకు గ్రామంలో మురికికాలువలు శుభ్రం చేయడం, నీటి క్లోరినేషన్, గుంతలు పూడ్చడం, గుంతల్లో నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందకుండా డీజిల్ వేయడం, రోడ్లపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడం తదితర పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపడతారు.
 విడుదల కాని నిధులు
 ఈ ఆర్థిక సంవత్సరం ఎన్‌ఆర్‌ెహ చ్‌ఎం, స్టేట్ ఫైనాన్స్ నిధులు విడుద ల కాకపోవడంతో ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం, గ్రామ పంచాయతీల్లో వివిధ పన్నుల రూపంలో వసూలయ్యే (జనరల్ ఫండ్స్) నిధులను పారిశుధ్య నిర్వహణకు ఖర్చు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ రెండు రకాల నిధులతోనే పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. పన్నులు వసూలు కాని గ్రామాల్లో మాత్రం పారిశుధ్య నిర్వహణ భారంగా మారింది.
 వర్షాకాలం కావడంతో విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో ప్రజలు విషజ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ, మలేరియాతో ఈ వారం రోజుల్లోనే పదిమందికిపైగా మరణించారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి కుమారస్వామి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు నిధుల కొరత లేదని, అందుబాటులో ఉన్న నిధులతో శానిటేషన్ పనులు చేయిస్తున్నామని చెప్పారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం    నిధులు   వస్తే గ్రామాల్లో మరిన్ని పారిశుధ్య పనులు  చేపట్టే  వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.


 

>
మరిన్ని వార్తలు