కాశ్మీరొక్కటే సమస్య కాదు

17 Nov, 2014 01:40 IST|Sakshi

భారత్‌తో సంబంధాలపై పాక్ హైకమిషనర్ బాసిత్
 
హైదరాబాద్: భారత్, పాక్‌ల మధ్య కాశ్మీర్ అంశం ఒక్కటే సమస్య కాదని, పది వివిధ అంశాలపై చర్చలు జరగాల్సిన అవసరముందని భారత్‌లో పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. గతంలో కాశ్మీర్ వివాదం పరిష్కారమయ్యే వరకు మిగతా చర్చలకు ఆస్కారం లేని పరిస్థితి ఉండేదని, అప్పటితో పోల్చితే ఇప్పుడెంతో ముందడుగు వేశామని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్, పాక్ మధ్య గత ఆగస్టులో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం రద్దయినప్పటినుంచీ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోందని గుర్తు చేశారు. పాక్‌ను ఉగ్రవాదపీడిత దేశంగా అభివర్ణించారు. ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ 2015 నుంచి మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2022లోగా ఆరు సిరీస్‌ల నిర్వహణకు ప్రణాళిక సిద్ధమవుతోందన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, జర్నలిస్టు నాయకుడు దేవుల పల్లి అమర్, ప్రెస్‌కౌన్సిల్ సభ్యుడు అమర్‌నాథ్ పాల్గొన్నారు.

హైదరాబాద్ ఆతిథ్యాన్ని మరిచిపోలేను

హైదరాబాద్ నగరం తానూహించిన దానికంటే ఎంతో అందంగా ఉందంటూ బాసిత్ కితాబిచ్చారు. ‘‘భారత్‌లో బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నగరానికొచ్చాను. ఇక్కడి సంస్కతీ సంప్రదాయాలకు నగరం అద్దం పడుతోంది. మరచిపోలేనంత ఆత్మీయంగా ఆతిథ్యమిచ్చింది. హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, ఇతర వంటకాల రుచిని ఎప్పటికీ మరిచిపోలేను’’ అన్నారు. ఆదివారం ఇండో అరబ్ లీగ్ చైర్మన్ సయ్యద్ వికారుద్దీన్ నివాసంలో ఏర్పాటు చేసిన విందులో బాసిత్ పాల్గొన్నారు. అదే సందర్భంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోనూ మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు