2022లోపు ప్రతి పేదోడికి పక్కా ఇల్లు

24 Nov, 2018 05:00 IST|Sakshi

కార్మిక చట్టాలు సరళతరం చేశాం

కేంద్ర మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌

సుభాష్‌నగర్‌ (నిజామాబాద్‌అర్బన్‌): దేశంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి 2022 లోపు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ సహాయమంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. పీఎఫ్‌ ఖాతాదారులు తమ డబ్బులను అవసరమైనప్పుడు వాడుకునేలా చట్టబద్ధం చేశామని తెలిపారు. కార్మిక చట్టాల నిబంధనలను సరళతరం చేశామని, కార్మికులకు ఉపయోగపడేలా చట్టాల్లో అనేక మార్పులు తెచ్చామని స్పష్టం చేశారు. కేంద్రం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా ఉండాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ అభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు.
 

మరిన్ని వార్తలు