కబ్జా చెరలో పాలేరు జలాశయం

6 Jul, 2020 09:19 IST|Sakshi

పంట భూములవుతున్న రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌  ప్రాంతం

ఏటేటా కుదించుకుపోతున్న విస్తీర్ణం

కూసుమంచి: పాలేరు రిజర్వాయర్‌ (జలాశయం) బ్యాక్‌ వాటర్‌ ప్రాంతం క్రమక్రమంగా కుదించుకుపోతోంది. ఏటా రిజర్వాయర్‌ చుట్టూ ఉన్న రైతులు రిజర్వాయర్‌ భూమిని మాగాణులుగా మార్చుతున్నారు. దీంతో దాని విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అవకాశం ఉన్న చోటల్లా రైతులు రిజర్వాయర్‌ భూమిని తమ భూముల్లో కలుపుకుపోతున్నారు. కొందరైతే ఏకంగా పట్టాలే పొందినట్లు సమాచారం. మండలంలోని పాలేరు రిజర్వాయర్‌ జిల్లాకే వరప్రదాయినిగా మారింది. ఈ రిజర్వాయర్‌ ద్వారానే జిల్లాకు సాగునీరు, తాగునీరు సరఫరా అవుతోంది. వంతాలి మత్స్యకారులకు ఆధారమైంది. సుమారు 6,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్‌ కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురవుతుండగా ఏటేటా విస్తీర్ణం తగ్గిపోతోంది.

మాగాణులుగా.. 
పాలేరు రిజర్వాయర్‌ ఇటు కూసుమంచి మండలంతో పాటు అటు సూర్యాపేట జిల్లాలోని మోతె మండలం వరకు విస్తరించి ఉంది. ఈ రిజర్వాయర్‌ ముఖ భాగం నాయకన్‌గూడెం, పాలేరు గ్రామాల వద్ద రాష్ట్రీయ రహదారికి ఆనుకుని ఉంది. ఇక చివరి భాగం (బ్యాక్‌ వాటర్‌ ప్రాంతం) కూసుమంచి, మోతె మండలాల్లోని సుమారు 15 గ్రామాల వరకు విస్తరించి ఉంది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన రైతులకు రిజర్వాయర్‌ లోతట్టులో భూములు ఉన్నాయి. వారు తమ భూములను సాగు చేసుకుంటూనే రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ ప్రాంతాన్ని కలుపుకుని మాగాణులుగా మార్చి తమ వ్యవసాయ భూముల్లో కలుపుకుంటున్నారు.

రిజర్వాయర్‌ నిండినా వారు ఆక్రమించిన భూములు మునగకుండా ఎత్తుగా కట్టలు పోసి మడులుగా మార్చుతున్నారు. సంబంధిత అధికారులు గుర్తించ లేకపోవడం, గుర్తించినా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తమ పనిని మానడం లేదు. ఇప్పటి వరకు రిజర్వాయర్‌ భూమిని వందలాది ఎకరాల్లో రైతులు ఆక్రమించి వ్యవసాయ భూములుగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు రైతులు ఆక్రమించిన భూమికి ఏకంగా పట్టాలు పొందినట్లు సమాచారం. ఎన్నెస్పీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో రెవెన్యూ అధికారులు ఆ భూములకు పట్టాలు ఇస్తుండటంతో ఎన్సెస్పీ అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంటోంది. 

భవిష్యత్‌కు ప్రమాదం.. 
పాలేరు రిజర్వాయర్‌ జిల్లాలోనే అతిపెద్ద జలాశయంగా ఉంది. ఈ రిజర్వాయర్‌ 23 అడుగుల నీటి నిలువ కాగా 2.558 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఆక్రమణలతో విస్తీర్ణం తగ్గిపోతుండటంతో రిజర్వాయర్‌ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం ఏటేటా ఆక్రమణల వల్ల తగ్గుతుండటంతో రాబోయే రోజుల్లో సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో సీతారామ ప్రాజెక్టు నీరు పాలేరు రిజర్వాయర్‌కు చేరితే అందుకు తగ్గ నీటినిల్వకు అవకాశం ఉండదని పలువురు భావిస్తున్నారు. ఆక్రమణలను చెరిపి రిజర్వాయర్‌ భూములను కాపాడితేనే నీటి నిల్వ పెరిగి అవసరాలకు అనుగుణంగా ఉంటుందని, ఆక్రమణలను అరికట్టాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం..
పాలేరు రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ ప్రాంతాన్ని కొందరు రైతులు ఆక్రమించుకుని వ్యవసాయ భూములుగా మార్చుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మేం ఆ భూములను పరిశీలిస్తే కొందరు రైతులు తమకు పట్టాలు ఉన్నట్లు చూపుతున్నారు. ఆ భూములను మేం సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను కోరాం. ఆక్రమణ భూముల వివరాలను సేకరించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. -మన్మథరావు, డీఈఈ, ఓఅండ్‌ఎం, ఎన్నెస్పీ

ఎఫ్‌టీఎల్‌ చూపితే హద్దులు నిర్ణయిస్తాం
రిజర్వాయర్‌ ప్రాంతం ఆక్రమణకు గురవుతున్నట్లు ఎన్సెస్పీ అధికారులు మా దృష్టికి తీసుకువచ్చారు. వారు ముందుగా ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) ప్రాంతాన్ని గుర్తిస్తే మేం హద్దులు నిర్ణయిస్తాం. ప్రస్తుతం సర్వేయర్ల కొరత కూడా ఉంది. ఎఫ్‌టీఎల్‌ గుర్తించిన వెంటనే మేం హద్దులు పెట్టి ఆక్రమణలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
-శిరీష, తహసీల్దార్, కూసుమంచి  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా